NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

ప్రతి వార్డులో అభివృద్ధి.. ప్రతి సమస్యకు పరిష్కారం.. కూటమికే ప్రజల మద్దతు: మంత్రి టీజీ భరత్

1 min read

అభివృద్ధి అజెండాతో సైకిల్ యాత్ర చేపట్టిన మంత్రి టీజీ భరత్

28, 29, 31వ వార్డుల్లో కార్పొరేటర్ అభ్యర్థులకు మద్దతుగా ప్రచారం

కర్నూలు, న్యూస్​ నేడు: కూటమి ప్రభుత్వం కొనసాగుతేనే కర్నూలు నగరంలో అభివృద్ధి జరుగుతుందని  రాష్ట్ర పరిశ్రమలు, వాణిజ్యం, ఫుడ్ ప్రాసెసింగ్ శాఖ మంత్రి టీజీ భరత్ ప్రజలకు పిలుపునిచ్చారు. మున్సిపల్ ఎన్నికల్లో కూటమి అభ్యర్థులను భారీ మెజారిటీతో గెలిపించాలని కోరుతూ కర్నూలు నగరంలో మంత్రి టీజీ భరత్ భారీ సైకిల్ యాత్ర నిర్వహించారు. ఈ సందర్భంగా 28, 29, 31 వార్డుల్లో సైకిల్ పై పర్యటిస్తూ ప్రజలకు అభివాదం చేశారు. తెలుగుదేశం పార్టీ అభ్యర్థులను గెలిపించాలని కోరారు.

రెండేళ్ల నాలుగు నెలల్లో ఎన్నో ఏళ్ల సమస్యలకు పరిష్కారం

కూటమి ప్రభుత్వ రెండేళ్ల నాలుగు నెలల కాలంలో కర్నూలు నగరంలోని ప్రతి వార్డులో ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేశామని మంత్రి టీజీ భరత్ తెలిపారు. ఎన్నో ఏళ్లుగా పరిష్కారానికి నోచుకోని సమస్యలను సైతం పరిష్కరించి ప్రజల మన్ననలు పొందామని పేర్కొన్నారు. నగరంలో అభివృద్ధి పనులు మరింత వేగంగా కొనసాగాలంటే మున్సిపల్ ఎన్నికల్లో కూటమి అభ్యర్థులను గెలిపించాలని కోరారు. సైకిల్ యాత్రలో భాగంగా 28వ వార్డు తెలుగుదేశం పార్టీ కార్పొరేటర్ అభ్యర్థి దానమ్మ, 29వ వార్డు అభ్యర్థి రమణమ్మ, 31వ వార్డు అభ్యర్థి ప్రవీణ్ కుమార్‌లకు మద్దతుగా మంత్రి టీజీ భరత్ ప్రచారం నిర్వహించారు. కూటమి మేయర్ అభ్యర్థి బొల్లెద్దుల విజయ ప్రత్యూషతో పాటు ఆయా వార్డుల అభ్యర్థులను సైకిల్ గుర్తుపై ఓటు వేసి గెలిపించాలని ప్రజలను కోరారు.

 ఓర్వకల్లుకు భారీ పెట్టుబడులు.. యువతకు వేలాది ఉద్యోగాలు

ఓర్వకల్లు ప్రాంతానికి రూ.50 వేల కోట్ల పెట్టుబడులను తీసుకొచ్చేందుకు కృషి చేస్తున్నామని మంత్రి టీజీ భరత్ తెలిపారు. ఈ పెట్టుబడులు కార్యరూపం దాల్చితే వేలాది మందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభిస్తాయని పేర్కొన్నారు. పెట్టుబడుల రాకతో కర్నూలు జిల్లా రూపురేఖలు మారనున్నాయని ఆశాభావం వ్యక్తం చేశారు. రిలయన్స్ కంపెనీ త్వరలో ప్రారంభం అవ్వనుందన్నారు. అంతేకాకుండా త్వరలో మరో రూ.7 వేల కోట్ల పెట్టుబడులు పెడుతోందన్నారు. దీంతో వేలాది మందికి ఉద్యోగాలు వస్తాయన్నారు.

 కర్నూలు అభివృద్ధి కొనసాగాలంటే కూటమిని గెలిపించండి

కర్నూలు నగరాన్ని మరింత అభివృద్ధి చేసి ప్రజలకు మెరుగైన మౌలిక సదుపాయాలు కల్పించడమే తమ లక్ష్యమని మంత్రి స్పష్టం చేశారు. వార్డు వార్డులో రోడ్లు, కాల్వలు, త్రాగునీరు, విద్యుత్ స్తంభాల సమస్యలు పరిష్కరిస్తున్నట్లు చెప్పారు. నగరంలో ట్రాఫిక్ సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు.  ప్రజల సమస్యలను పరిష్కరిస్తూ అభివృద్ధి పథంలో ముందుకు సాగుతున్న తమ అభ్యర్థులకు సైకిల్ గుర్తుపై ఓటు వేసి గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. అలాగే మేయర్ అభ్యర్థి బొల్లెద్దుల విజయ ప్రత్యూషకు సైకిల్ గుర్తుపై ఓటు వేసి గెలిపించాలని ప్రజలను మంత్రి కోరారు.

About Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *