పదవ తరగతిలో మంచి ఫలితాలు సాధించాలి
1 min read

జిల్లా కలెక్టర్ డాక్టర్ ఏ. సిరి
కర్నూలు, న్యూస్ నేడు : పదవ తరగతి విద్యార్థులు రాబోయే పబ్లిక్ పరీక్షల్లో ఉత్తమ ఫలితాలు సాధించాలని కలెక్టర్ డాక్టర్ ఏ. సిరి సూచించారు. ప్రతి విద్యార్థి లక్ష్యాన్ని నిర్దేశించుకొని క్రమశిక్షణతో చదువుకుంటే మంచి ఉత్తీర్ణత సాధించడం సాధ్యమని పేర్కొన్నారు.బుధవారం కల్లూరు మండలం చిన్న టేకూరు గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను ఆకస్మికంగా సందర్శించిన కలెక్టర్, ముందుగా పాఠశాలలో అమలు అవుతున్న మధ్యాహ్న భోజన పథకాన్ని తనిఖీ చేశారు. విద్యార్థులకు అందిస్తున్న ఆహారం నాణ్యత, పరిశుభ్రత, మెనూ ప్రకారం భోజనం అందిస్తున్నారా అని పరిశీలించారు. వంటగది నిర్వహణ, నిల్వలు, త్రాగునీటి సదుపాయాలపై అధికారులను ప్రశ్నించారు. విద్యార్థులతో మాట్లాడి భోజనంపై అభిప్రాయాలను అడిగి తెలుసుకున్నారు. ఉపాధ్యాయులు ప్రతి విద్యార్థి ప్రగతిని నిరంతరం పర్యవేక్షిస్తూ, వెనుకబడిన విద్యార్థులపై ప్రత్యేక శ్రద్ధ చూపాలని ఆదేశించారు. పాఠశాలల్లో విద్యా వాతావరణాన్ని మెరుగుపరచడంతో పాటు తల్లిదండ్రులతో సమన్వయం పెంచి విద్యార్థుల అభివృద్ధికి కృషి చేయాలని సూచించారు. పదవ తరగతి ఫలితాలు జిల్లాకు గౌరవప్రదంగా ఉండాలని, ప్రతి పాఠశాల మంచి ఫలితాల కోసం కృషి చేయాలని కలెక్టర్ ఆదేశించారు.ఈ కార్యక్రమంలో విద్యా శాఖ అసిస్టెంట్ డైరెక్టర్ అసుదుల్లా ఖాన్, సర్వ శిక్ష అభియాన్ ప్రాజెక్ట్ ఆఫీసర్ డాక్టర్ లోక్ రాజు, తహశీల్దార్ ఆంజనేయులు, ఎంపీడీవో నాగశేషాచలారెడ్డి, సంబంధిత అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

