NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

వరద విపత్తులను ఎదుర్కొనేందుకు మైక్రోలెవెల్ ప్లానింగ్ తో సిద్ధంగా ఉండాలి

1 min read

విపత్తుల నియంత్రణ కార్యాచరణను పటిష్టంగా చేపట్టాలి

వరద పరిస్ధితులపై కలెక్టర్ కె.వెట్రిసెల్వి సమీక్ష

ఏలూరుజిల్లా, న్యూస్​ నేడు: గోదావరి వరద, అకాలవరద పరిస్ధితులను సమర్ధవంతంగా ఎదుర్కొనేందుకు విపత్తు నియంత్రణ కార్యాచరణను పటిష్టంగా చేపట్టాలని జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి అధికారులను ఆదేశించారు. మంగళవారం  స్ధానిక కలెక్టరేట్ గౌతమీ సమావేశ మందిరంలో జాయింట్ కలెక్టర్ పి. ధాత్రిరెడ్డి, ఐటిడిఏ పివో, సబ్ కలెక్టర్, ఆర్డిఓలు, పోలీస్, రెవిన్యూ, ఇరిగేషన్, తదితర శాఖల అధికారులతో కలెక్టర్ సమావేశమై గోదావరి వరద నియంత్రణ, ప్లాష్ ఫ్లడ్, సహాయక చర్యలపై సమీక్షించారు. ఈ సందర్బంగా జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి మాట్లాడుతూ వరద సంసిద్ధత ప్రణాళిక కింద చేపట్టవలసిన ముందస్తు చర్యలను గత అనుభవాల నేపద్యంలో అవసరమైన ప్రత్యేక చర్యలను వివరించారు. గ్రామ, మండల, డివిజన్ స్దాయిలో కమిటీలను ఏర్పాటు చేయడంతోపాటు మండల స్ధాయిలో రెవిన్యూ, పోలీస్, విద్యుత్, ఫైర్ సర్వీసెస్,ఇరిగేషన్, ఆర్ అండ్ బి, వ్యవసాయ అనుబంధ శాఖల అధికారుల పేర్లు, అత్యవసర ఫోన్ నెంబర్లు సిద్ధంగా ఉంచాలన్నారు. వరదల సమయంలో 24 గంటలు పనిచేసే కంట్రోల్ రూమ్ లను ఏర్పాటు చేయాలన్నారు. అన్ని మండలాల్లో వరద, భారీ వర్షాల పరిస్ధితులకు సంబంధించి అత్యవసర సందేశాలు పంపేందుకు ప్రత్యేక వాట్సాప్ గ్రూపులను ఏర్పాటు చేసుకోవాలన్నారు. వరదలకు సంబంధించి జిల్లా సరిహద్దుల్లోని ఎఎస్ఆర్, భధ్రాద్రికొత్తగూడెం, కృష్ణాజిల్లాల అధికారులతో కూడిన ఇంటర్ డిస్టిక్ కమీటీలను ఏర్పాటు చేసుకోవాలన్నారు. భద్రాచలంతోపాటు గోదావరి నదికి మరింత ఎగువ తెలంగాణాలోని ఆయా ప్రాంతాల్లో నమోదు అవుతున్న వరద సమాచారాన్ని ఎప్పటికప్పుడు పరిశీలించాలని, తద్వారా వరద సహాయ చర్యలను మరింత ముందుగా చేపట్టేందుకు సమయం ఉంటుందని సూచించారు.  కుక్కునూరు, వేలేరుపాడులో 101 నివాసిత ప్రాంతాల్లో మొదటి, రెండవ, మూడవ వరద ప్రమాద హెచ్చరికలకు అనుగుణంగా పునరావాస కార్యక్రమాలు చేపట్టాలన్నారు. పునరావాస కార్యక్రమాలకు సంబంధించి ఆర్ డబ్ల్యూఎస్, డిపివో, విద్యుత్, ఎంపిడివోలతో కూడిన బృందం రిలీఫ్ కేంద్రాలను సంయుక్త తనిఖీ చేసి అక్కడవున్న సౌకర్యాలను పరిశీలించి, స్ధానికుల అవసరాలను తెలుసుకోవాలని కలెక్టర్ ఆదేశించారు. అన్ని నివాసిత ప్రాంతాల్లో హ్యాండ్ పంపుల పనితీరును పరిశీలించాలని, తాత్కాలిక టాయిలెట్ల ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలన్నారు. ఏలూరు, నూజివీడులో వరద, అకాల వర్షాల మూలంగా సంబంవించే పరిస్ధితులను ఎదుర్కొనేందుకు మున్సిపల్ కమీషనర్లు, సబ్ కలెక్టర్, ఆర్డిఓలు సమన్వయంతో పనిచేయాలన్నారు.జిల్లా జాయింట్ కలెక్టర్ పి. ధాత్రిరెడ్డి మాట్లాడుతూ వరద ప్రభావిత ప్రాంతాల్లో వినియోగానికి ముందస్తుగా జనరేటర్లను సిద్ధంగా ఉంచాలన్నారు.  వరద ప్రభావిత ప్రాంతాల్లో సరఫరాకు అవసరమైన మూడు నెలల నిత్యావసర వస్తువులను సిద్ధం చేసినట్లు తెలిపారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు పునరావాస కేంద్రాలను గుర్తించి అక్కడ అవసరమైన మౌలిక సదుపాయాలు కల్పించాలన్నారు.సమావేశంలో జిల్లా రెవిన్యూ అధికారి వి. విశ్వేశ్వరరావు, ఏలూరు డిఎస్పీ డి. శ్రావణ్ కుమార్, ఆర్ అండ్ బి, పంచాయితీరాజ్,ఇరిగేషన్, ఆర్ డబ్ల్యూఎస్,విద్యుత్, వ్యవసాయ అనుబంధరంగాలు,రవాణా, ఆర్.టి.సి,వైద్య ఆరోగ్యశాఖ, విద్యాశాఖ, ఫైర్ సర్వీసెస్, పౌర సరఫరాలు తదితర శాఖల అధికారులు పాల్గొన్నారు.

About Author