రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించాలి – సూపరింటెండెంట్
1 min read
కర్నూలు, న్యూస్ నేడు: కర్నూలు ప్రభుత్వ సర్వజన ఆసుపత్రిలో ఈరోజు నిర్వహించిన హెచ్.ఓ.డీ ల సమావేశంలో ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ కె. వెంకటేశ్వర్లు పలు కీలక అంశాలపై చర్చించి, సంబంధిత అధికారులకు సూచనలు చేశారు.వచ్చే నెల నుంచి రోగుల వద్దకు అధిక సంఖ్యలో సందర్శకులు రాకుండా విజిటర్ పాస్ విధానం అమలు చేయనున్నట్లు తెలిపారు. ఆసుపత్రిలో అందుబాటులో ఉన్న మందులను బయట కొనుగోలుకు రోగులకు రాయకూడదని మరోసారి స్పష్టం చేశారు. కొంతమంది పీజీ వైద్యులు, హౌస్ సర్జన్లు పరీక్షలను బయటకు రాస్తున్న విషయంపై హెచ్.ఓ.డీ లు తమ విభాగాల్లో వైద్యులకు తగిన సూచనలు చేసి, ఇటువంటి చర్యలను నివారించాలని ఆదేశించారు.వివిధ విభాగాల్లో పెండింగ్‌లో ఉన్న సివిల్ పనులను త్వరితగతిన పూర్తి చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. అలాగే, అన్ని విభాగాల్లో శస్త్రచికిత్సల నిర్వహణను మెరుగుపరచడంతో పాటు, ఎలక్ట్రానిక్ హెల్త్ రికార్డ్స్ (EHR) వ్యవస్థను మరింత సమర్థవంతంగా అమలు చేయాలని సూచించారు.ఈ సందర్భంగా సూపరింటెండెంట్ డాక్టర్ కె. వెంకటేశ్వర్లు మాట్లాడుతూ, రోగులకు నాణ్యమైన వైద్య సేవలు అందించడమే ప్రధాన లక్ష్యమని, అన్ని విభాగాధిపతులు సమన్వయంతో పనిచేస్తూ ఆసుపత్రి సేవలను మరింత మెరుగుపరుస్తామని తెలిపారు.ఈ కార్యక్రమంలో ఆసుపత్రి సూపరింటెండెంట్ తో పాటు కర్నూల్ మెడికల్ కాలేజీ ప్రిన్సిపల్ డాక్టర్ కే చిట్టి నరసమ్మ , డిప్యూటీ సూపరింటెండెంట్లు డా లక్ష్మీ భాయ్ , డా నాగేశ్వరరావు , డిప్యూటీ కలెక్టర్/అడ్మినిస్ట్రేటర్ సింధు సుబ్రహ్మణ్యం , CSRMO డా పి పద్మజ , డిప్యూటీ CSRMO డా వి పద్మజ గారు మరియు ఆసుపత్రి అడ్మినిస్ట్రేషన్ అధికారులు పాల్గొన్నారు.


