40వ రూబీ జూబ్లీ వేడుకలకు ఘనంగా ఏర్పాట్లు
1 min read
కర్నూలు, న్యూస్ నేడు: డాక్టర్ ఎన్టీఆర్ ఆరోగ్య విజ్ఞాన విశ్వవిద్యాలయం 40 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా నిర్వహిస్తున్న ప్రతిష్ఠాత్మక రూబీ జూబ్లీ వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు విశ్వవిద్యాలయ వైస్ ఛాన్సలర్ డాక్టర్ పి. చంద్రశేఖర్, MD, DM తెలిపారు. ఈ సందర్భంగా వైస్ ఛాన్సలర్ డాక్టర్ పి. చంద్రశేఖర్ మాట్లాడుతూ, 1986లో స్థాపించబడిన డాక్టర్ ఎన్టీఆర్ ఆరోగ్య విజ్ఞాన విశ్వవిద్యాలయం నాలుగు దశాబ్దాలుగా వైద్య విద్య, ఆరోగ్య విజ్ఞానం, పరిశోధన రంగాల్లో విశేష సేవలు అందిస్తోందని పేర్కొన్నారు. వైద్య విద్యా ప్రమాణాలను పెంపొందించడం, నాణ్యమైన వైద్య సేవలకు అవసరమైన నైపుణ్యం కలిగిన వైద్య నిపుణులను తీర్చిదిద్దడం, విద్యార్థులకు మెరుగైన విద్యా అవకాశాలను కల్పించడం వంటి లక్ష్యాలతో విశ్వవిద్యాలయం ముందుకు సాగుతోందని తెలిపారు.ఈ ప్రతిష్ఠాత్మక రూబీ జూబ్లీ వేడుకలు 2026 అక్టోబర్ 26వ తేదీ సోమవారం ఉదయం 11 గంటలకు, విజయవాడలోని డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ స్మృతి వనం ప్రాంగణంలోని అంబేద్కర్ కళావేదికలో నిర్వహించనున్నట్లు వెల్లడించారు.ఈ వేడుకలకు భారత ఉపరాష్ట్రపతి శ్రీ సి.పి. రాధాకృష్ణన్ ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు. ఆంధ్రప్రదేశ్ గవర్నర్ జస్టిస్ ఎస్. అబ్దుల్ నజీర్ , ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు విశిష్ట అతిథులుగా పాల్గొననున్నారు. రాష్ట్ర వైద్య, ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి శ్రీ సత్యకుమార్ యాదవ్ , నేషనల్ మెడికల్ కమిషన్ (NMC) అధ్యక్షుడు డాక్టర్ ఎం.కె. రమేష్ గౌరవ అతిథులుగా పాల్గొననున్నారు.ఈ వేడుకలు విశ్వవిద్యాలయ ప్రస్థానంలో ఒక ముఖ్యమైన మైలురాయిగా నిలుస్తాయని, వైద్య విద్యా రంగంలో విశ్వవిద్యాలయం సాధించిన విజయాలను స్మరించుకోవడంతో పాటు భవిష్యత్తులో మరిన్ని ఉన్నత లక్ష్యాలను సాధించేందుకు స్ఫూర్తినిస్తాయని డాక్టర్ పి. చంద్రశేఖర్ పేర్కొన్నారు.ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు విశ్వవిద్యాలయ రిజిస్ట్రార్ డాక్టర్ టి. సాయి సుధీర్, ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ సభ్యులు, అధికారులు, బోధన మరియు బోధనేతర సిబ్బంది సమన్వయంతో ఏర్పాట్లు చేస్తున్నారని తెలిపారు.


