సంక్షేమంతో పాటు రాష్ట్ర అభివృద్ధిని పరుగులు పెట్టించేలా 2026-27 బడ్జెట్..
1 min read

మంత్రి టీజీ భరత్
కర్నూలు, న్యూస్ నేడు: శాసనసభలో ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ రూ.3,32,205 కోట్లతో ప్రవేశపెట్టిన 2026-27 వార్షిక బడ్జెట్ రాష్ట్రాన్ని అభివృద్ధి దిశలో తీసుకెళ్లడంతో పాటు సంక్షేమాన్ని పరుగులు పెట్టించేలా ఉందని రాష్ట్ర పరిశ్రమలు, వాణిజ్యం, ఫుడ్ ప్రాసెసింగ్ శాఖ మంత్రి టీజీ భరత్ అన్నారు. బడ్జెట్‌పై ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. విద్యార్థుల నుండి రైతులు, వ్యాపారులు, పేదలు, మహిళలు, బీసీ,ఎస్సీ,ఎస్టీ, మైనారిటీ, అన్ని సామాజిక వర్గాల వారికి ఎంతో ప్రయోజనం చేకూర్చేవిధంగా రాష్ట్ర ప్రభుత్వ బడ్జెట్ ఉందని పేర్కొన్నారు. ఆర్థిక లోటు ఉన్నప్పటికీ సంక్షేమ పథకాలకు పెద్దపీట వేశామన్నారు. వైసీపీ ప్రభుత్వ హయాంలో ఎంతో నష్టం జరిగిందని, సీఎం నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలో అభివృద్ధిలో రాష్ట్రం ఎంతో ముందుకెళ్తోందన్నారు. అమరావతి నిర్మాణంతో పాటు రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల అభివృద్ధికి కూటమి ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. బడ్జెట్‌లో రాయలసీమ గ్లోబల్ హార్టికల్చర్ హబ్ కోసం రూ.30,000 కోట్లు కేటాయించడం గొప్ప నిర్ణయమని పేర్కొన్నారు. స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ విధానం అమలుచేయడం వల్లే పెట్టుబడుల్లో రాష్ట్రం ప్రపంచం దృష్టిని ఆకర్షిస్తోందన్నారు. కూటమి ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఈ బడ్జెట్ అందరికీ అనుకూలమైందన్నారు.

