చంద్రబాబూ.. ఇవి అసలు ఎన్నికలేనా?
1 min read
ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసి సాధించిన గెలుపు కూడా ఒక గెలుపేనా?
స్థానిక ఎన్నికల్లో అధికార దుర్వినియోగం, దాడులు, దౌర్జన్యాలు జరిగాయి
వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో మీడియా సమావేశంలో ఆలూరు ఎమ్మెల్యే బుసినే విరుపాక్షి విమర్శలు
హోళగుంద న్యూస్ నేడు: స్థానిక సంస్థల ఎన్నికలు జరిగిన తీరు ప్రజాస్వామ్య వ్యవస్థకే మచ్చ తెచ్చే విధంగా ఉందని ఆలూరు ఎమ్మెల్యే బుసినే విరుపాక్షి తీవ్రస్థాయిలో విమర్శించారు. ఈరోజు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా ప్రతినిధుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం, టీడీపీ నాయకులపై పలు ఆరోపణలు చేశారు.రాష్ట్ర రాజకీయాల్లో ఇలాంటి నీచ రాజకీయాలను గతంలో ఎప్పుడూ చూడలేదని, దాడులు, దౌర్జన్యాలతో ఎన్నికల్లో గెలిచిన టీడీపీ నాయకులు ఏదో ఘనకార్యం సాధించినట్లు విర్రవీగడం విడ్డూరంగా ఉందని అన్నారు. నామినేషన్ల ప్రక్రియ ప్రారంభం కాకముందు నుంచే పోలీసు అధికారులను ఉపయోగించుకుని వైఎస్సార్సీపీ అభ్యర్థులపై దాడులు చేయించారని, కనీసం నామినేషన్లు వేసేందుకు కూడా అవకాశం లేకుండా అడ్డంకులు సృష్టించారని ఆరోపించారు.నామినేషన్ దాఖలు నుంచి కౌంటింగ్ వరకు వైఎస్సార్సీపీ అభ్యర్థులను కూటమి నాయకులు అన్ని విధాలుగా ఇబ్బందులకు గురిచేశారని విమర్శించారు. కౌంటింగ్ సమయంలో వైఎస్సార్సీపీకి ఆధిక్యం వస్తున్న సందర్భాల్లో అధికారులను బెదిరించి రీకౌంటింగ్ నిర్వహించి ఫలితాలను తారుమారు చేశారని ఆరోపించారు. ప్రజల తీర్పును గౌరవించకుండా అధికార బలంతో ఫలితాలను ప్రభావితం చేయడం ప్రజాస్వామ్యానికి సిగ్గుచేటని అన్నారు.ప్రజలు వైఎస్సార్సీపీని గెలిపిస్తే అధికారులు టీడీపీకి డిక్లరేషన్ ఇస్తారా? ఇదెక్కడి న్యాయం చంద్రబాబూ? అని ప్రశ్నించారు. పోలీసులు, అధికారులు అధికార పార్టీ నాయకులతో కుమ్మక్కై పనిచేస్తున్నారనే భావన ప్రజల్లో కలగడం ప్రజాస్వామ్య వ్యవస్థలపై నమ్మకాన్ని దెబ్బతీస్తోందని పేర్కొన్నారు.స్థానిక సంస్థల ఎన్నికలకే ముఖ్యమంత్రి స్థాయి నుంచి దాడులు, దౌర్జన్యాలను ప్రోత్సహిస్తే రాబోయే రోజుల్లో ఎన్నికలు స్వేచ్ఛగా, నిష్పక్షపాతంగా ఎలా జరుగుతాయని ప్రశ్నించారు. వ్యక్తిగత రాజకీయ ప్రయోజనాల కోసం కొందరు పోలీసులు తమ వృత్తి ధర్మాన్ని పక్కనపెడుతున్నారని, నారా లోకేష్ రాజకీయ భవిష్యత్తు కోసం రాష్ట్రాన్ని రావణకాష్టంగా మారుస్తున్నారని విమర్శించారు.మూడు పార్టీలు కలిసి పోటీ చేసినా స్వేచ్ఛగా, నిష్పక్షపాతంగా ఎన్నికలు నిర్వహించే ధైర్యం లేదా చంద్రబాబూ? అని నిలదీశారు. ప్రజాస్వామ్యంలో గెలుపు అంటే ప్రజల విశ్వాసాన్ని పొందడం తప్ప దాడులు, దౌర్జన్యాలు, అధికార దుర్వినియోగంతో సాధించేది నిజమైన విజయంగా భావించలేమని అన్నారు.వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలు ఎవరూ అధైర్యపడవద్దని, ధైర్యంగా ఉండాలని పిలుపునిచ్చారు. దేవుడు అన్ని విధాలా తమకు అండగా ఉంటాడని, రాబోయే సర్పంచ్ ఎన్నికలకు ప్రతి ఒక్కరూ ఇప్పటి నుంచే సిద్ధం కావాలని కోరారు. ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం పార్టీ శ్రేణులంతా ఐక్యంగా పనిచేయాలని సూచించారు.ఈ మీడియా సమావేశంలో వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.


