ఏకీకృత కుటుంబ సర్వేకు సహకరించండి
1 min read
నగరపాలక సంస్థ కమిషనర్ పి.విశ్వనాథ్
కర్నూలు, న్యూస్ నేడు: సోమవారం నగరంలోని ప్రతి కుటుంబ వివరాలు ప్రభుత్వ రికార్డుల్లో ఖచ్చితంగా నమోదు చేయాలనే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం ఏకీకృత కుటుంబ సర్వేను చేపట్టిందని నగరపాలక సంస్థ కమిషనర్ పి.విశ్వనాథ్ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సర్వే డిసెంబర్ నెల చివరి వారం నుంచి ప్రారంభమై నగర వ్యాప్తంగా ఇంటింటా నిర్వహించబడుతోందన్నారు.ప్రతి కుటుంబం ప్రస్తుత పరిస్థితిని నమోదు చేసి రికార్డులను నవీకరించడమే సర్వే ప్రధాన ఉద్దేశ్యమని తెలిపారు. భవిష్యత్తులో అర్హులైన కుటుంబాలు, వ్యక్తులు ప్రభుత్వ సంక్షేమ పథకాలను పొందేందుకు ఈ సర్వే కీలకంగా ఉపయోగపడుతుందని పేర్కొన్నారు.సచివాలయ సిబ్బంది ప్రత్యేక మొబైల్ అప్లికేషన్ ద్వారా ఇంటి వద్దకే వచ్చి కుటుంబ వివరాలను సేకరిస్తారని, దీనివల్ల సమాచారం లోపాలు లేకుండా పారదర్శకంగా నమోదు అవుతుందని తెలిపారు. కావున సర్వే సిబ్బంది వచ్చినప్పుడు ప్రజలు అవసరమైన సరైన వివరాలు అందించి పూర్తి స్థాయిలో సహకరించాలని కమిషనర్ విజ్ఞప్తి చేశారు.

