NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

ఏలూరు నియోజకవర్గాన్ని అన్ని రంగాలలో అభివృద్ధి చేయాలి

1 min read

ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి

మార్కెట్ యార్డ్ వద్ద 50 కోట్లతో నిర్మించే ఓవర్ బ్రిడ్జి రోడ్ల ప్రగతి పనులపై ఆర్ అండ్ బి అధికారులు నివేదిక సమర్పించాలి

ఏలూరుజిల్లా ప్రతినిధి న్యూస్​ నేడు : ఏలూరు నియోజకవర్గం అన్ని రంగాలలో అభివృద్ధి పధంలో నిలిచేలా అధికారులు కృషి చేయాలనీ ఏలూరు శాసనసభ్యులు బడేటి రాధాకృష్ణయ్య (చంటి) పిలుపునిచ్చారు. స్థానిక ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో గురువారం సుపరిపాలనలో తొలిఅడుగు కార్యక్రమంలో భాగంగా స్వర్ణాంధ్ర-2047, పీ4, తదితర కార్యక్రమాలపై అధికారులతో ఎమ్మెల్యే సమీక్షించారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే రాధాకృష్ణయ్య  మాట్లాడుతూ 2047 నాటికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ప్రంపంచంలోను,  2029 నాటికి  దేశంలో అగ్రగామి రాష్ట్రంగా తీర్చిదిద్ధేందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి స్వర్ణాంధ్ర@ 2047 కార్యాచరణ ప్రణాళిక ను అమలు చేస్తున్నారన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా ఏలూరు నియోజకవర్గంలో ప్రతీ ఏటా 15 శాతం వృధ్దిరేటుతో కార్యాచరణ ప్రణాళిక అమలు చేస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా ఏలూరు నియోజకవర్గంలో వ్యవసాయ, అనుబంధ రంగాలు, పారిశ్రామిక, సేవా రంగాలలో వృద్ధిరేటు సాదించేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలన్నారు. ముఖ్యంగా ఏలూరులోని యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు మెరుగుపడేలా పారిశ్రామికవేత్తలను గుర్తించి  పరిశ్రమలు స్థాపించేలా చర్యలు తీసుకోవాలన్నారు. ఏలూరు నగరం పరిసరాలలో ఎన్నో ఇంజనీరింగ్ కాలేజీలు ఉన్నాయని, వాటిలో చదువుకున్న యువతకు నైపుణ్యాభివృద్ధిలో శిక్షణ ఇచ్చేందుకు ఏలూరులో నైపుణ్యాభివృద్ధి కాలేజ్ ఏర్పాటుకు ప్రతిపాదనలు రూపొందించాలని, అదేవిధంగా ఎంఎస్ఎంఈ పార్క్ ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని  అధికారులను ఎమ్మెల్యే ఆదేశించారు.   ఏలూరు నగరాన్ని పూర్తి పరిశుభ్రతతో కూడిన ఆహ్లాదకరమైన నగరంగా రూపొందించడానికి చర్యలు తీసుకోవాలని, నగరంలోని కెనాల్ కు ఇరువైపులా చెత్త లేకుండా  ఉద్యానవనాలు పెంచి, ఆకర్షణీయంగా తీర్చిదిద్దాలన్నారు. ఏలూరు నగరంలో రోడ్లు, డ్రైనేజి వంటి కల్పించాల్సిన  మౌలిక సదుపాయాలపై డివిజన్ల వారీగా నివేదిక సమర్పించాలని నగరపాలక సంస్థ అధికారులను ఆదేశించారు. పరిశ్రమలు, వివిధ వాణిజ్య సంస్థలు చెల్లించే  కార్పొరేషన్ సామజిక బాధ్యత నిధుల నుండి ఏలూరు నియోజకవర్గంలో తీసుకోవలసిన అభివృద్ధి కార్యక్రమాలపై ప్రతిపాదనలు రూపొందించాలన్నారు.  ఏలూరు మార్కెట్ యార్డ్ వద్ద 50 కోట్లతో ప్రతిపాదించిన ఓవర్ బ్రిడ్జి నిర్మాణ పనులు, ఆశ్రమ ఆసుపత్రి నుండి కైకలూరు రోడ్డుకు అనుసంధానించే రోడ్ల నిర్మాణ పనుల ప్రగతి పై నివేదిక సమర్పించాలని ఆర్అండ్ బి అధికారులను ఎమ్మెల్యే ఆదేశించారు. ఏలూరు నగరంలోని పేదలకు నిర్మించే గృహాల నిర్మాణ పనులను వేగవంతం చేయాలనీ, ఆయా కాలనీలలో రోడ్లు,త్రాగునీరు,డ్రైనేజి వంటి మౌలిక సదుపాయాలు కల్పించేందుకు వెంటనే చర్యలు తీసుకోవాలని గృహ నిర్మాణ శాఖాధికారులను ఎమ్మెల్యే ఆదేశించారు. నియోజకవర్గంలోని ప్రభుత్వ పాఠశాలకు అవసరమైన మౌలిక సదుపాయాలపై ప్రతిపాదనలు రూపొందించి సమర్పించాలని ఆదేశించారు.  ఏలూరు నగరంలో అమృత్ 2.0 మురుగువ్యర్ధాల శుద్దీకరణ ప్లాంట్ నిర్మాణం, త్రాగునీరు వనరుల పనులను వేగవంతం చేయాలన్నారు. పేదప్రజల జీవన ప్రమాణాల స్థాయి పెంచడమే పీ4 పధకం లక్ష్యమని, ఏలూరు నియోజకవర్గంలో గుర్తించిన  బంగారు కుటుంబాలను మార్గదర్శకులు అనుసంధానించి, వారి  ఆర్థికాభివృద్ధికి చర్యలు తీసుకోవాలన్నారు. కార్యక్రమంలో ఏలూరు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్ పెద్దిబోయిన శివప్రసాద్, ఏలూరు నగరపాలక సంస్థ కో ఆప్షన్ సభ్యులు ఎస్.ఎం. ఆర్ పెదబాబు, డిప్యూటీ కమీషనర్ చంద్రయ్య, డిప్యూటీ ఇంజనీర్ సురేంద్రబాబు, సమగ్రశిక్ష ప్రాజెక్ట్ డైరెక్టర్ పంకజ్ కుమార్, సిపివో వాసుదేవరావు, సోషల్ వెల్పేర్ జెడి వై.విశ్వమోహన్ రెడ్డి, జిల్లా మైనారిటీ సంక్షేమ అధికారి ఎన్.ఎస్. కృపావరం, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.

About Author