రైతులు రసాయన ఎరువుల వాడకాన్ని తగ్గించాలి…
1 min read

పోస్టర్లను ఆవిష్కరించిన జిల్లా కలెక్టరు,జాయింట్ కలెక్టర్ కె.వెట్రిసెల్వి, పి.ధాత్రిరెడ్డి
ఏలూరుజిల్లా ప్రతినిధి న్యూస్ నేడు : జిల్లా కలెక్టరేటు గోదావరి సమావేశ మందింరంలో సోమవారం జిల్లా వ్యవసాయశాఖ వారి ఆధ్వర్యంలో రసాయన ఎరువుల వాడకాన్ని తగ్గించాలనే సందేశ పోస్టర్లను జిల్లా కలెక్టరు కె.వెట్రిసెల్వి, జిల్లా జాయింటు కలెక్టరు పి.ధాత్రిరెడ్డి సంయుక్తంగా ఆవిష్కరించారు.ఈ సందర్బంగా జిల్లా కలెక్టరు కె.వెట్రిసెల్వి మాట్లాడుతూ రసాయన ఎరువుల వాడకాన్ని తగ్గించాలనే సదుద్దేశంతో కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు పిఎం-ప్రణమ్ అనే కార్యక్రమాన్ని ప్రారంభించారు. గోదావరి జిల్లాల్లో ఎక్కువ మితిమీరి రసాయనిక ఎరువులు వాడడం వలన ఆరోగ్య సమస్యలు, పర్యావరణ సమస్యలు తలెత్తుతున్నాయని తెలిపారు. రైతులు జీవన ఎరువులు, సేంద్రీయ ఎరువులను ఉపయోగించి రసాయనిక ఎరువుల వాడకాన్ని తగ్గించాలన్నారు. దీని వలన భూమి యొక్క ఆరోగ్య పరిస్థితిని మెరుగు పరచాలన్నారు.నానో యూరియా,నానో డీఏపీలను రైతులు అందించడం జరిగిందన్నారు.భవిష్యత్ తరాలకు రసాయనిక ఎరువుల ఖర్చును మరియు రవాణా భారాన్ని దృష్టిలో ఉంచుకొని కొత్త రకం ఎరువులు అనగా నానో యూరియా, నానో డీఏపీ ఎరువులను ప్రోత్సహిస్తున్నామన్నారు. పర్యావరణం ఆరోగ్య హితమైన జీవన ఎరువుల వినియోగాన్ని పెంచాలని దీనివల్ల రైతులకు తక్కువ ఖర్చుతో ఎక్కువ ఫలసాయం వస్తుందని జిల్లా కలెక్టరు కె.వెట్రిసెల్వి అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా వ్యవసాయశాఖ అధికారి ఎస్ కె.హబీబ్ భాషా, జెడ్పి సిఇఓ ఎం.శ్రీహరి, డిఆర్డిఏ పిడి ఆర్.విజయరాజు,వ్యవసాయ శాఖ అధికారులు ఇ.అనీల్ కుమారి,డి. వెంకటేశ్వర్లు, కె.మీనాకుమారి,తదితరులు పాల్గొన్నారు.

