రైతులు తమ పంటకు తామే ధర నిర్ణయించే స్థాయికి ఎదగాలి
1 min read
రైతు సంక్షేమమే ప్రకృతి వ్యవసాయ ధ్యేయం
జిల్లా కలెక్టర్ రాజకుమారి గణియా
నంద్యాల, న్యూస్ నేడు: రైతులు ప్రకృతి వ్యవసాయాన్ని అవలంబించి తమ పంటకు తామే ధర నిర్ణయించే స్థాయికి ఎదగాలని జిల్లా కలెక్టర్ జి. రాజకుమారి పిలుపునిచ్చారు. మంగళవారం నంద్యాల పట్టణంలోని క్రాంతి నగర్ లో డి.పి.యం.యు ఆధ్వర్యంలో జరుగుతున్న టీ–ఐసీఆర్‌పీ ఐదు రోజుల పాటు నిర్వహిస్తున్న శిక్షణ కార్యక్రమానికి కలెక్టర్ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు.ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ జి. రాజకుమారి మాట్లాడుతూ రైతులు ప్రకృతి వ్యవసాయాన్ని అవలంబించి తమ పంటకు తామే ధర నిర్ణయించే స్థాయికి ఎదగాలని, మార్కెటింగ్ నైపుణ్యాలను అభివృద్ధి చేసుకోవాలని పిలుపునిచ్చారు. జిల్లాలో ఒక లక్ష ఎకరాల్లో ప్రకృతి వ్యవసాయం విస్తరింపజేయాలనే లక్ష్యంతో ప్రభుత్వం, వ్యవసాయ శాఖలు సమన్వయంతో ముందుకు సాగుతున్నాయని కలెక్టర్ తెలిపారు. ప్రస్తుతం 50 వేల మంది రైతులు మాత్రమే పాక్షికంగా ప్రకృతి వ్యవసాయ పద్ధతులు అవలంబిస్తుండగా, పూర్తిగా ప్రకృతి వ్యవసాయం చేస్తున్న రైతులు 6,000 మంది ఉన్నారని వివరించారు.ప్రతి టి–ఐసీఆర్‌పీ ఒక ఆదర్శ రైతుగా ఎదిగి, ఇతరులను ప్రకృతి వ్యవసాయం వైపు మార్చేలా ప్రేరేపించాలన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా వ్యవసాయ అధికారి ఎం.సి. మద్దిలేటి, డిపిఎం శ్రీనివాసులు, ఏడిపిఎం అబ్దుల్ సలాం, జిల్లా ఎన్‌ఎఫ్‌ఏలు, డి.టి.టిలు, టీ–ఐసీఆర్‌పీలు పాల్గొన్నారు.

