NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

యోగాకు అత్యధిక ప్రాధాన్యతనివ్వండి

1 min read

ప్రతి మండలంలో 200 మంది యోగ శిక్షకులుగా శిక్షణ ఇవ్వాలి

జిల్లా కలెక్టర్ శ్రీమతి రాజకుమారి గణియా

నంద్యాల, న్యూస్​ నేడు: మానవ దైనందిన జీవితంలో యోగాకు అత్యధిక ప్రాముఖ్యత ఉన్నట్లు ఐక్యరాజ్యసమితి ధ్రువీకరించిన నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం యోగా కార్యక్రమానికి అత్యధిక ప్రాధాన్యత నిచ్చి ప్రభుత్వం సూచించిన కార్యక్రమాలను ముమ్మరంగా చేపట్టాలని జిల్లా కలెక్టర్ జి.రాజకుమారి జిల్లా, మండల స్థాయి అధికారులను ఆదేశించారు. గురువారం కలెక్టరేట్ లోని వీడియో కాన్ఫరెన్స్ హాలులో యోగ ఆంధ్రా – 2025 కార్యక్రమాలపై ఎంపిడిఓలు, తహశీల్దార్లు, మున్సిపల్ కమీషనర్లు, స్పెషల్ ఆఫీసర్లతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కలెక్టర్ సమీక్ష నిర్వహించారు. వీడియో కాన్ఫరెన్స్ లో జాయింట్ కలెక్టర్ సి.విష్ణుచరణ్, డిఆర్ఓ రాము నాయక్, జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు.ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ జి.రాజకుమారి మాట్లాడుతూ ధైనందిన జీవితంలో ఆరోగ్య పరిరక్షణకు యోగ ప్రాముఖ్యతపై ప్రజల్లో అవగాహన తీసుకొస్తూ కార్యక్రమాలు చేపట్టాలని ప్రభుత్వం సూచించింది అన్నారు. 2014లో ఐకారాజ్య సమితి అసెంబ్లీలో జూన్ 21వ తేదీన అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని నిర్వహించేలా తీర్మానం చేయడం జరిగిందన్నారు. అప్పటినుంచి ప్రతి సంవత్సరం జూన్ 21వ తేది నుండి అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని జరుపుకుంటున్నాం అన్నారు. ఈ సంవత్సరం జూన్ 21వ తేదీన అంతర్జాతీయ యోగా కార్యక్రమంలో ప్రధానమంత్రి, రాష్ట్ర ముఖ్యమంత్రి పాల్గొంటారన్నారు. అదే విధంగా రాష్ట్ర ప్రభుత్వం ఈ నెల 21వ తేది నుండి ఒక నెల రోజుల పాటు యోగాంధ్ర మాసోత్సవ ప్రారంభ వేడుకను నిర్వహించడం జరిగిందన్నారు. జిల్లా నుండి గుర్తించిన యోగ గురువులు, శిక్షకులకు ఢిల్లీలోని మొరార్జీ దేశాయ్ యోగ ఇన్స్టిట్యూట్ నుండి శిక్షణ ఇవ్వడం జరుగుతుందన్నారు. శిక్షణ పొందిన శిక్షకులు మండల స్థాయిలో 200 మందికి శిక్షణ ఇవ్వడం జరుగుతుందని  వారు మిగతా వారికి శిక్షణా ఇచ్చేలా చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు. ఈ అంశంలో మున్సిపల్ కమీషనర్లు, ఎంపిడిఓలు, తహశీల్దార్లు, స్పెషల్ ఆఫీసర్లు, ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని కలెక్టర్ ఆదేశించారు. మున్సిపల్ పట్టణాల్లో జన సంచారం అధికంగా ఉన్న ప్రాంతాల్లో యోగా నేపథ్యానికి సంబంధించి ఆకర్షణీయమైన పెయింటింగ్స్ వేయించాలని మున్సిపల్ కమీషనర్లను కలెక్టర్ ఆదేశించారు.అదే విధంగా 4 పర్యాటక ప్రాంతాల్లో కూడా యోగ ఆంధ్రా కార్యక్రమాలు నిర్వహించాలని…అందులో శ్రీశైలం దేవస్థానం ప్రాంగణంలో మే 31వ తేదిన, జూన్ 7వ తేదీన మహానంది దేవస్థానం ప్రాంగణంలో, జూన్ 13వ తేదీన బెల్లుం గుహల వద్ద, జూన్ 20వ తేదీన పచ్చర్ల జంగిల్ క్యాంప్ లో యోగా నిర్వహణ కార్యక్రమాలకు సంబంధించిన అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. అదే విధంగా జిల్లా కేంద్రంలో జూన్ 16వ తేదీన 5వేల మంది విద్యార్థులతో యోగ కార్యక్రమం చేపట్టేందుకు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని మున్సిపల్ కమీషనర్ కలెక్టర్ ఆదేశించారు. జూన్ 8వ తేదీన కూడా 75 సంవత్సరాలు పైబడిన వారిని కూడా యోగ ఆంధ్రా కార్యక్రమంలో పాల్గొనేలా చూడాలని సాంఘిక సంక్షేమ, విభిన్న ప్రతిభావంతుల సంక్షేమ శాఖ అధికారి కలెక్టర్ ఆదేశించారు. అంతేకాకుండా ఈ 26వ తేది నుండి 30వ తేది వరకు గ్రామ స్థాయిలో యోగ ఫర్ ఆల్ కాన్సెప్ట్ పై పోటీలు నిర్వహించాలని కలెక్టర్ తెలిపారు. పోటీలో గెలుపొందిన విజేతలను జూన్ 2వ తేది నుండి 7వ తేది వరకు మండల స్థాయి జరిగే కార్యక్రమాల్లో పాల్గొంటారన్నారు. మండల స్థాయిలో గెలుపొందినవారు జిల్లా స్థాయిలో జూన్ 9వ తేది నుండి 14వ తేది వరకు జరిగే కార్యక్రమాల్లో పాల్గొంటారన్నారు. జిల్లాస్థాయిలో గెలుపొందిన వారు విశాఖపట్నంలో ప్రధానమంత్రి పాల్గొనే కార్యక్రమంలో పాల్గొనే అవకాశం ఉంటుందన్నారు. జిల్లాలోని అన్ని ప్రభుత్వ కార్యాలయాల వద్ద యోగ ఆంధ్రా-2025 కు సంబంధించి పోస్టర్లను ఏర్పాటు చేసేలా చూడాలన్నారు.

About Author