రేపు టిడ్కో లబ్దిదారులకు గృహాల అప్పగింత
1 min read
నగరపాలక సంస్థ కమిషనర్ పి.విశ్వనాథ్
239, 240, 241 బ్లాకుల్లో 144 గృహాలు సిద్ధం
కర్నూలు, న్యూస్ నేడు: సోమవారం జగన్నాథగట్టుపై ఉన్న ఎన్టీఆర్ కాలనీలో నిర్మాణాలు పూర్తైన టిడ్కో గృహాలను లబ్దిదారులకు మంగళవారం అప్పగించనున్నట్లు నగరపాలక సంస్థ కమిషనర్ పి.విశ్వనాథ్ తెలిపారు. సోమవారం ఆయన టిడ్కో గృహాల్లో పూర్తైన పనులను పరిశీలించారు.ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యానికి అనుగుణంగా అర్హులైన పేద కుటుంబాలకు పక్కా గృహాలు అందించే దిశగా చర్యలు చేపడుతున్నామని చెప్పారు. ఎన్టీఆర్ కాలనీలో 976 టిడ్కో గృహాలు అప్పగించాల్సి ఉండగా, వాటిలో తొలి దశలో ఇప్పటికే 187 గృహాలు లబ్దిదారులకు అందించామని, ప్రస్తుతం 239, 240, 241 బ్లాకుల్లో 144 గృహాలను అప్పగించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయని వివరించారు. మంగళవారం రాష్ట్ర పరిశ్రమలు, వాణిజ్యం, ఫుడ్ ప్రాసెసింగ్ శాఖ మంత్రి టీజీ భరత్, ఎంపీలు బస్తిపాటి నాగరాజు, బైరెడ్డి శబరి, ఎమ్మెల్యేలు గౌరు చరితరెడ్డి, బొగ్గుల దస్తగిరి చేతుల మీదుగా గృహాల అప్పగింత జరగనున్నట్లు తెలిపారు.టిడ్కో గృహాల నిర్మాణాలు అత్యుత్తమ నాణ్యతతో, కొత్త సాంకేతికతతో చేపట్టినట్లు తెలిపారు. రవాణా సౌకర్యం, తాగునీటి సరఫరా, విద్యుత్, రహదారులు, డ్రైనేజీ, పారిశుద్ధ్యం వంటి మౌలిక వసతులు ఇప్పటికే కల్పించామని చెప్పారు. లబ్దిదారులు వెంటనే ఇళ్లలో నివాసం ప్రారంభించేందుకు అవసరమైన అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయని పేర్కొన్నారు. మిగిలిన గృహాలను కూడా పనులు పూర్తయ్యే క్రమంలో దశలవారీగా అప్పగిస్తామని తెలిపారు.కార్యక్రమంలో ప్రజారోగ్య అధికారి డాక్టర్ నాగ ప్రసాద్, టిడ్కో అధికారులు పెంచలయ్య, మధు, శానిటేషన్ ఇన్‌స్పెక్టర్ హుస్సేన్, ఎలక్ట్రికల్ సూపర్వైజర్ జగదీష్, తదితరులు పాల్గొన్నారు.

