బ్రాహ్మణుల అభివృద్ధి కోసం కృషి చేస్తా.. కరణం నవీన్ కుమార్
1 min read

అఖిల భారత బ్రాహ్మణ సంఘం యువజన విభాగం జాతీయ అధ్యక్షుడిగా కరణం నవీన్ ఎంపిక
కర్నూలు, న్యూస్ నేడు: బ్రాహ్మణుల అభివృద్ధి కోసం నిరంతరం కృషి చేస్తానని అఖిల భారత బ్రాహ్మణ సంఘం యువజన విభాగం జాతీయ అధ్యక్షుడు కరణం నవీన్ కుమార్ అన్నారు. అఖిల భారత బ్రాహ్మణ సంఘం యువజన విభాగం జాతీయ అధ్యక్షుడిగా కరణం నవీన్ ఎంపికైన సందర్భంగా కర్నూలులోని మౌర్య ఇన్ హోటల్లో సన్మాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సంఘం నాయకులు చెరుకుచెర్ల రఘురామయ్య, జూపూడి శ్రీనివాస్, అశ్వనీకుమార్, నాగేంద్రశర్మ, మేడికొండ లక్ష్మీకాంతారావు, అనీల్ శర్మ, ఇస్కాల సురేష్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా నూతన అధ్యక్షుడిగా ఎంపికైన నవీన్ కుమార్కు వీరు శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం కరణం నవీన్ మాట్లాడుతూ బ్రాహ్మణ సంఘ బలోపేతం కోసం, సమాజ అభివృద్ధి దిశగా యువతను ప్రోత్సహించడానికి తాను నిరంతరం కృషి చేస్తానన్నారు. భారత జాతి నిర్మాణంలో బ్రాహ్మణ యువతకు ముఖ్యమైన పాత్ర ఉందన్నారు. ఆ పాత్రను సద్వినియోగం చేసుకునేలా మార్గదర్శక కార్యక్రమాలు చేపడతానని, అదేవిధంగా, దేశవ్యాప్తంగా బ్రాహ్మణ యువజన సంఘాలను ఏకతాటిపైకి తీసుకువచ్చి సామాజిక, సాంస్కృతిక, విద్యా రంగాల్లో సేవా కార్యక్రమాలను విస్తరించే దిశగా చర్యలు తీసుకుంటానని ఆయన పేర్కొన్నారు. అనంతరం చెరుకుచెర్ల రఘురామయ్య మాట్లాడుతూ నూతన జాతీయ అధ్యక్షుడిగా యువకుడు, ఉత్సాహవంతుడు, విద్యావంతుడు అయిన కరణం నవీన్ కుమార్ ఎంపిక అవ్వటం చాలా సంతోషకరం అన్నారు. సంఘం యొక్క ఆశయాలను, లక్ష్యాలను చేరుకోవటానికి కృషి చేసి సంఘాన్ని బలోపేతం చేయాలని ఆయన సూచించారు.

