NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

శ్రమజీవుల ఆలోచనా దీపం కార్ల్ మార్క్స్

1 min read

సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు డేగా ప్రభాకర్.

సిపిఐ ఏలూరు జిల్లా సహాయ కార్యదర్శి బండి వెంకటేశ్వరరావు

ఏలూరు జిల్లా ప్రతినిధి,న్యూస్ నేడు: భారత కమ్యూనిస్టు పార్టీ (సిపిఐ) ఏలూరు ఏరియా సమితి ఆధ్వర్యంలో కార్ల్ మార్క్స్ 143వ వర్ధంతి కార్యక్రమం ఏలూరు, ఆర్.ఆర్.పేట, స్ఫూర్తి భవన్ నందు జరిగినది.ఈ కార్యక్రమంలో పాల్గొన్న సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు డేగా ప్రభాకర్ మాట్లాడుతూ ప్రపంచాన్ని మార్చడానికి ఒక గొప్ప మహోన్నత ఆయుధాన్ని అందించిన మహానీయుడు కార్ల్ మార్క్స్ అని కొనియాడారు. కార్ల్ మార్క్స్ కు పూర్వం అనేకమంది శాస్త్రవేత్తలు, సామాజికవేత్తలు ప్రజల సమస్యలు పరిష్కరించడం ద్వారా ప్రపంచాన్ని మార్చాలని అనేక ప్రయత్నాలు చేసినప్పటికీ సరైన మార్గాన్ని నిర్దేశించలేకపోయారు. వాటన్నింటినీ పరిశోధించిన కార్ల్ మార్క్స్ ప్రపంచంలో అసమానతలు తొలగిపోవడానికి పెట్టుబడిదారులు కార్మికుల శ్రమను దోచుకోవడమే కారణమని ప్రపంచానికి తెలియజేస్తూ అదనపు విలువ గురించి క్యాపిటల్ పుస్తకాన్ని రచించడం ద్వారా తెలియజేసి సమాజానికి సరైన మార్గాన్ని దిశా నిర్దేశం చేసిన గొప్ప వ్యక్తి అని తెలిపారు. తన మిత్రుడు ఫ్రెడరిక్ ఎంగెల్స్ తో కలిసి అనేక రచనలు చేశారని తెలిపారు. కార్మికులను,కర్షకులను సమీకరించి సంఘాలు నిర్మించడంలో నిరంతర కృషి  చేశారని తెలిపారు.మతం మత్తు, కులం కుళ్ళు అంటూ భారతదేశ రాజకీయ వ్యవస్థ గురించి 160 ఏళ్ల క్రితమే కార్లు మార్క్స్ తెలియజేశారని ప్రస్తుతం దేశంలో ఆనాడు మార్క్స్ చెప్పిన విధంగా మతం పేరుతో, కులం పేరుతో విభజన రాజకీయాలను బిజెపి ప్రభుత్వం చేస్తుందని ఆరోపించారు. కార్ల్ మార్క్స్ రచనలను అధ్యయనం చేసిన ప్రపంచ పెట్టుబడిదారీ వ్యవస్థ సమాజంలో అందరికీ సమాన అవకాశాలు అందితే తమ మనుగడ సాగించడం అసాధ్యమని మార్క్సిజంపై దాడి చేస్తూనే ఉన్నారని ఆవేదన వ్యక్తం చేశారు. సమాజంలోని అంతరాలు తొలగించడానికి ఎంతగానో కృషి చేసిన కార్ల మార్క్స్ నిరంతరం స్ఫూర్తిని అందిస్తున్నారని ఆయన ఆశయాలను సాధించడమే ప్రతి కమ్యూనిస్టు పార్టీ కార్యకర్త లక్ష్యం కావాలని ఆకాంక్షించారు. సిపిఐ ఏలూరు ఏరియా సమితి కార్యదర్శి ఉప్పులూరి హేమ శంకర్, సహాయ కార్యదర్శి కురెళ్ల వర ప్రసాద్ మాట్లాడుతూ మానవ చరిత్రలో అత్యంత శక్తివంతమైన ఆలోచనలను, శ్రమిక వర్గ విముక్తి దిశగా మార్గదర్శకత్వాన్ని అందించిన మహానుభావుడు కార్ల్ మార్క్స్ అని కొనియాడారు.1818 మే 5న జర్మనీలోని ట్రయర్ పట్టణంలో జన్మించిన కార్ల్ మార్క్స్, 1883 మార్చి 14న లండన్‌లో కన్నుమూశారని కానీ ఆయన ఆలోచనలు మాత్రం ఇప్పటికీ జీవించి, పోరాడుతున్నాయని తెలిపారు.ప్రపంచాన్ని చూసే దృక్పథాన్నే మార్చివేసిన కార్ల్ మార్క్స్ ఆశయ  సాధనకు కృషి చేయాలని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో ఏలూరు ఏరియా కార్యవర్గ సభ్యులు మావూరి విజయ, గొర్లి స్వాతి,కొండేటి రాంబాబు,బళ్ల కనక దుర్గారావు, ఏలూరు జిల్లా కౌన్సిల్ సభ్యులు పుప్పాల కన్నబాబు, ఉప్పులూరి లక్ష్మి, భవాని,శ్రీదేవి,బేతా శంకర్,మురళి, తదితరులు పాల్గొన్నారు.

About Author