కర్నూలు బస్సు ప్రమాదం దురదృష్టకరం
1 min read

ప్రమాదం పై అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నాం
రాష్ట్ర హోం శాఖా మంత్రి వంగలపూడి అనిత
కర్నూలు, న్యూస్ నేడు : కర్నూలు బస్సు ప్రమాదం దురదృష్టకరం అని రాష్ట్ర హోం శాఖ మంత్రి వంగలపూడి అనిత పేర్కొన్నారు..శుక్రవారం స్థానిక జిల్లా పోలీసు కార్యాలయంలో ఉన్న వ్యాస్ ఆడిటోరియం లో చిన్నటేకూరు వద్ద జరిగిన ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ప్రమాద ఘటనపై హోం శాఖ మంత్రి వర్యులు వంగలపూడి అనిత, రవాణా శాఖా మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి ప్రెస్ కాన్ఫరెన్స్ నిర్వహించారు.ఈ సందర్భంగా హోం శాఖ మంత్రి మాట్లాడుతూ ప్రైవేట్ ట్రావెల్స్ కు చెందిన వేమూరి కావేరి ట్రావెల్స్ బస్ నెంబర్ DD 01N 9490 హైదరాబాద్ నుండి బెంగళూరు వెళ్తున్న సమయంలో తెల్లవారుజామున 3 గంటల నుండి 3.15 సమయంలో ప్రమాదానికి గురి అవడం చాలా బాధాకరమైన విషయం అన్నారు… ప్రాథమిక సమాచారం మేరకు ఎదురుగా వస్తున్న బైక్ ను ఢీకొని, 15 నుండి 20 మీటర్ల దూరం వరకు అలాగే తీసుకొని వెళ్లడం ద్వారా వచ్చిన స్పార్క్ వల్ల మంటలు చెలరేగి 19 మంది చనిపోవడం జరిగిందన్నారు.. అందులో 17 మంది పెద్దవాళ్లు 2 చిన్నపిల్లలు ఉన్నారని, వీరు చనిపోవడం చాలా దురదృష్టకరమైన విషయం అన్నారు.. ప్రమాద ఘటన తెల్లవారుజామున 3 గంటల నుండి 3.15 గంటల మధ్యలో జరిగిన తర్వాత 3.21 గంటలకు స్థానిక సిఐకు సమాచారం వచ్చిన వెంటనే పోలీస్, అగ్నిమాపక శాఖ వారు వెంటనే ప్రమాద ఘటన స్థలం వద్దకు వచ్చి రెస్క్యూ ఆపరేషన్ మొదలుపెట్టారన్నారు.. ప్రమాదఘటన గురించి సమాచారం వచ్చిన వెంటనే రాష్ట్ర ముఖ్యమంత్రి, మంత్రులు, డీజీపీ, స్థానిక ప్రజా ప్రతినిధులు, తదితరులకు సమాచారం చేరవేశారన్నారు…ఘటన గురించి ప్రజా ప్రతినిధులకు తెలిసిన వెంటనే ఉదయం 6.30 గంటలకు ఘటన స్థలం వద్దకు చేరుకొని రెస్క్యూ ఆపరేషన్ కి సహాయ సహకారాలు అందించారన్నారు. అదే విధంగా హైవే లో బస్సు లు ఎంత వేగంతో వెళ్లాలి అనే ఎస్ ఓ పి కూడా తయారు చేస్తామన్నారు. మంత్రుల వెంట డిజిపి హరీష్ కుమార్ గుప్తా, డిఐజి కోయ ప్రవీణ్, జిల్లా కలెక్టర్ డా.ఏ.సిరి, జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్, పాణ్యం ఎమ్మెల్యే గౌరు చరిత, కోడుమూరు ఎమ్మెల్యే బొగ్గుల దస్తగిరి, పత్తికొండ ఎమ్మెల్యే కేఈ శ్యామ్ బాబు, టిటిడి బోర్డు మెంబర్ మల్లెల రాజశేఖర్, ఇతర ప్రజా ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.

