కర్నూలు జిల్లాకు బడ్జెట్లో సవరణ చేసి నిధులు కేటాయించాలి… సిపిఎం
1 min read

న్యూస్ నేడు, పత్తికొండ: రాష్ట్ర బడ్జెట్లో సవరణలు చేసి కర్నూలు జిల్లాకు ప్రత్యేక నిధులు కేటాయించాలని సిపిఎం మండల కార్యదర్శి చక్రాల వెంకటేశ్వర్ రెడ్డి కోరారు. సోమవారం సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో రాష్ట్ర బడ్జెట్లో కర్నూలు జిల్లాకు నిధుల కేటాయింపులో జరిగిన అన్యాయంపై స్థానిక నాలుగు స్తంభాల కూడలి వద్ద ధర్నా నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, రాష్ట్ర బడ్జెట్లో కర్నూలు జిల్లాకు నిధులు కేటాయించడంపై కూటమి ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరించిందని, కర్నూలు జిల్లా వెనుకబడిన జిల్లా అని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రకటించినప్పటికీ నిధుల కేటాయింపులో జిల్లాకు తీవ్రంగా అన్యాయం జరిగిందని ఆయన పేర్కొన్నారు. స్థానిక ఈశ్వర్ రెడ్డి భవన్ నుంచి నాలుగు స్తంభాల వరకు ర్యాలీగా వెళ్లి ధర్నా కార్యక్రమం నిర్వహించారు. ఈ ధర్నా కార్యక్రమానికి సిపిఎం పార్టీ నాయకులు దస్తగిరి అధ్యక్షత వహించగా సీనియర్ నాయకుడు రంగారెడ్డి చక్రాల వెంకటేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వం వెనుక పడ్డ జిల్లా కర్నూలుకు సాగు త్రాగునీటి ప్రాజెక్టు నిర్మించడానికి హంద్రీ నీవా పూర్తి చేయాలని, అదేవిధంగా ఆర్డీఎస్ కుడి కాలువ వేదవతి రిజర్వాయర్ల నిర్మాణానికి ఒక రూపాయి కూడా బడ్జెట్లో కేటాయించలేదని కేవలం తూతూ మంత్రంగా బడ్జెట్లో నిధులు కేటాయించి చేతులు దులుపుకుందని వారన్నారు. ఈ బడ్జెట్లో ఆదోని మెడికల్ కాలేజీ, కర్నూలు ప్రభుత్వ హాస్పిటల్ కు నిధులు కేటాయించలేదన్నారు. ఈ కార్యక్రమంలో సిఐటియు మండల కార్యదర్శి ఎం. రవిచంద్ర, సిపిఎం పార్టీ నాయకులు హమాలి రామాంజనేయులు, గోపాల్ ఆటో వర్కర్స్ నాయకులు బిటి సుకప్ప, శీను, చందోలి కాశి, హమాలి నాయకులు చంద్ర, మాణిక్యం, ఈశ్వరయ్య, తదితరులు పాల్గొన్నారు.

