ధర్మానికి శ్రీరాముడు ఆదర్శం
1 min read

నగరపాలక సంస్థ కమిషనర్ పి.విశ్వనాథ్
కర్నూలు, న్యూస్ నేడు: శుక్రవారం ధర్మానికి శ్రీరాముడు ఆదర్శంగా నిలిచి, సత్యం, న్యాయం, నీతి మార్గాలను సమాజానికి చూపించిన ఆయన చరితం నేటి సమాజానికీ మార్గదర్శకంగా నిలుస్తోందని నగరపాలక సంస్థ కమిషనర్ పి.విశ్వనాథ్ తెలిపారు. శుక్రవారం శ్రీరామనవమి సందర్భంగా నగరంలోని పాతబస్తీ తెలుగు వీధిలో ఉన్న ఆంజనేయ స్వామి ఆలయం వద్ద నిర్వహించిన శోభాయాత్రను కమిషనర్ ప్రారంభించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. శ్రీరాముని ఆచరణలోని ధర్మం, సహనం, కర్తవ్యనిబద్ధత ప్రతి ఒక్కరూ జీవితంలో అవలంబించాల్సిన విలువలని పేర్కొన్నారు. కుటుంబ, సామాజిక జీవనంలో నైతిక విలువలు పెంపొందినప్పుడే సమాజం శాంతి, అభివృద్ధి దిశగా పయనిస్తుందని చెప్పారు. పండుగలు కేవలం ఆనందోత్సవాలకే పరిమితం కాకుండా మన సంస్కృతి, సంప్రదాయాలను గుర్తుచేసే అవకాశాలుగా భావించాలని సూచించారు. శ్రీరామనవమి వేడుకలను భక్తిశ్రద్ధలతో, ఐక్యతతో నిర్వహించడం ద్వారా సమాజంలో సౌహార్ద వాతావరణం మరింత బలపడుతుందని తెలిపారు.కార్యక్రమంలో మార్కెట్ యార్డు వైస్ చైర్మన్ శేషగిరి శెట్టి, కర్నూలు ప్రగతి సమితి వ్యవస్థాపక అధ్యక్షులు ఎం.శ్రీహర్ష, మాజీ కార్పొరేటర్ రంగస్వామి, కైప పద్మలత, నాయకులు ప్రతాప్ రెడ్డి, హనుమంతు, అనిల్, నవీన్, నిర్వాహకులు భార్గవ్, ప్రేమ్, నవీన్, చంద్ర తదితరులు పాల్గొన్నారు.

