పన్ను చెల్లింపునకు మిగిలింది.. “మూడు రోజులే”
1 min read

నగరపాలక సంస్థ మేనేజర్ యన్.చిన్నరాముడు
కర్నూలు, న్యూస్ నేడు: శుక్రవారం నగరపాలక సంస్థకు ఆస్తి పన్ను, తాగునీటి కొళాయి చార్జీలు చెల్లించడానికి మిగిలింది మూడు రోజులే కావడంతో ప్రజలు ఆలస్యం చేయకుండా పన్నులు చెల్లించాలని మేనేజర్ యన్.చిన్నరాముడు కోరారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఈ నెల 31తో ముగియనున్నందున అదేరోజుతో 50 శాతం వడ్డీ రాయితీ అవకాశం సైతం ముగుస్తుందని పేర్కొన్నారు. శుక్రవారం కల్లూరు వార్డు కార్యాలయం 84, 85వ సచివాలయం, లక్ష్మీనగర్, జెఎన్‌ఆర్ నగర్ 61,62వ సచివాలయం, నగరపాలక కొత్త, పాత కార్యాలయాల్లో ఏర్పాటు చేసిన ప్రత్యేక కౌంటర్లను ఆయన పరిశీలించారు.ఈ సందర్భంగా మేనేజర్ మాట్లాడుతూ.. చివరి వరకు వేచి ఉండకుండా సత్వరమే పన్నులు చెల్లించి నగరాభివృద్ధికి తోడ్పాటు అందించాలని కోరారు. పన్నులు చెల్లించేందుకు నగరపాలక కార్యాలయానికే రావాల్సిన అవసరం లేదని, నగరంలోని వివిధ ప్రాంతాల్లో ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. దండిగేరి, పెద్దపడఖాప 20,21వ సచివాలయం, బి.క్యాంపు, అరోరా నగర్ 56,57వ సచివాలయం, గురు రాఘవేంద్ర నగర్, రాజీవ్ గృహ కల్ప 92,93వ సచివాలయం, కల్లూరు వార్డు కార్యాలయం 84,85వ సచివాలయం, లక్ష్మీనగర్, జెఎన్‌ఆర్ నగర్ 61,62వ సచివాలయాల్లో ఈ కౌంటర్లు అందుబాటులో ఉన్నాయని తెలిపారు. ఇప్పటి వరకు రూ.70.30 కోట్ల ఆస్తి పన్నులు వసూలు అయ్యాయని, మిగిలిన బకాయిలను ప్రజలు జాప్యం చేయకుండా చెల్లించాలని సూచించారు.

