NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

మోంతా తుఫాను పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి

1 min read

27, 28, 29 తేదీల్లో నంద్యాల జిల్లాకు భారీ వర్షాల హెచ్చరిక

కలెక్టరేట్ కంట్రోల్ రూమ్ నంబర్: 08514-293903

మైనర్ ఇరిగేషన్ ట్యాంక్ బండ్‌లను పటిష్టం చేయండి

మట్టి మిద్దెల్లో నివసిస్తున్న వారిపై ప్రత్యేక దృష్టి పెట్టండి

జిల్లా కలెక్టర్ రాజకుమారి గణియా

నంద్యాల, న్యూస్​ నేడు:  బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా మోంతా తుఫాను ఈ నెల 27, 28, 29 తేదీల్లో జిల్లాలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని జిల్లా కలెక్టర్ జి.రాజకుమారి  అధికారులను ఆదేశించారు. శనివారం కలెక్టరేట్‌లోని పిజిఆర్ఎస్ హాలులో జిల్లా విపత్తు నిర్వహణపై జిల్లా, మండల స్థాయి అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో జాయింట్ కలెక్టర్ కొల్లాబత్తుల కార్తీక్, అదనపు ఎస్పీ యుగంధర్ బాబు, డిఆర్ఓ రాము నాయక్ తదితర అధికారులు పాల్గొన్నారు.ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ జి. రాజకుమారి మాట్లాడుతూ మోంతా తుఫాను చెన్నై తీరం వైపు నుండి విశాఖపట్నం దిశగా గంటకు 90–110 కి.మీ వేగంతో ఈదర గాలులతో కదులుతున్న నేపథ్యంలో భారీ వర్షాలు, బలమైన గాలులు వీచే అవకాశం ఉందని… అందువల్ల అన్ని శాఖలు అప్రమత్తంగా ఉండాలన్నారు. జిల్లాలో సుమారు 330 మైనర్ ఇరిగేషన్ ట్యాంకులు ఉన్నాయని, అందులో 200 ట్యాంకులు పూర్తి స్థాయిలో నిండి ఉన్నాయని, వీటి బండ్‌లను బలపరచాలని సంబంధిత మైనర్ ఇరిగేషన్ అధికారులకు కలెక్టర్ సూచించారు. నీటి ప్రవాహం ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో ప్రజలను అప్రమత్తం చేయడానికి టామ్‌టామ్ ద్వారా సమాచారాన్ని అందించడమే కాక, పోలీసు విభాగం సహకారం తీసుకోవాలని సూచించారు. కోతకు సిద్ధంగా ఉన్న మొక్కజొన్న పంటను వాయిదా వేయాలని, పంట నష్టాన్ని నివారించేందుకు రైతులకు అవగాహన కల్పించాలని వ్యవసాయ శాఖాధికారులను ఆదేశించారు. అలాగే పశువులకు అవసరమైన మందులు, మేత నిల్వలు సిద్ధంగా ఉంచి నష్టం జరగకుండా చూడాలని పశుసంవర్ధక అధికారులను ఆదేశించారు.ప్రజలు వాగులు, వంతెనలు, కాజ్వేలు దాటకుండా అప్రమత్తం చేయాలన్నారు. ఎవరైనా ప్రమాద పరిస్థితుల్లో చిక్కుకున్నట్లయితే వెంటనే కంట్రోల్ రూమ్ 08514–293903 నంబరుకు సమాచారం ఇవ్వాలన్నారు. ప్రజల భద్రత మన ప్రధాన లక్ష్యమని ప్రతి అధికారి తన విభాగానికి సంబంధించిన బాధ్యతలను పూర్తి స్థాయిలో నిర్వర్తించాలని కలెక్టర్ ఆదేశించారు.

About Author