ప్రభుత్వ జూనియర్ కళాశాలలో విద్యార్థులకు పోలీసుల అవగాహన కార్యక్రమం
1 min read
మహిళల భద్రత, సైబర్ నేరాలు, బాల్యవివాహాలు, మాదకద్రవ్యాలపై అవగాహన కల్పించిన ఎస్సై దిలీప్ కుమార్
హోళగుంద న్యూస్ నేడు: ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు హోళగుందమండల కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో హోలగుంద పోలీస్ స్టేషన్ ఆధ్వర్యంలో విద్యార్థులకు విస్తృత అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సుమారు 500 మంది విద్యార్థులు పాల్గొన్నారు.ఈ సందర్భంగా హోళగుంద పోలీస్ స్టేషన్ ఎస్సై దిలీప్ కుమార్ మాట్లాడుతూ మహిళలపై జరుగుతున్న నేరాలు, సైబర్ నేరాలు, బాల్యవివాహాల దుష్పరిణామాలు, మాదకద్రవ్యాల వినియోగం వల్ల కలిగే అనర్థాలు వంటి అంశాలపై విద్యార్థులకు వివరంగా అవగాహన కల్పించారు.ప్రస్తుతం సైబర్ నేరాలు రోజురోజుకూ పెరుగుతున్న నేపథ్యంలో అపరిచిత వ్యక్తుల ఫోన్ కాల్స్, సందేశాలు, సోషల్ మీడియా ద్వారా వచ్చే మోసపూరిత లింకులను నమ్మవద్దని, వ్యక్తిగత వివరాలు, బ్యాంకు ఖాతా సమాచారం, ఓటీపీలు ఎవరికీ తెలియజేయవద్దని సూచించారు.అలాగే IVRS కాల్స్ పర్సెప్షన్ గురించి విద్యార్థులకు వివరించి, ప్రభుత్వ సేవలు, ప్రజల అభిప్రాయ సేకరణకు సంబంధించిన IVRS కాల్స్ ప్రాముఖ్యతను తెలియజేశారు.ఇంటర్మీడియట్ విద్యార్థులు జీవితంలో అత్యంత కీలకమైన దశలో ఉన్నారని, ఈ సమయంలో లేనిపోని ఆకర్షణలు, చెడు స్నేహాలు, వ్యసనాలకు దూరంగా ఉండి లక్ష్యసాధనపై దృష్టి పెట్టాలని సూచించారు. తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల సూచనలు పాటిస్తూ మంచి భవిష్యత్తు కోసం కృషి చేయాలని విద్యార్థులకు పిలుపునిచ్చారు.మాదకద్రవ్యాల బారిన పడితే వ్యక్తిగత జీవితం, కుటుంబం, సమాజం తీవ్రంగా నష్టపోతాయని, అలాంటి అలవాట్లకు పూర్తిగా దూరంగా ఉండాలని సూచించారు. మహిళలను గౌరవించడం ప్రతి ఒక్కరి బాధ్యత అని, ఎలాంటి వేధింపులు ఎదురైనా వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని తెలిపారు.ఈ అవగాహన కార్యక్రమాన్ని విద్యార్థులు ఆసక్తిగా విని, పోలీసులు అందించిన సూచనలను పాటిస్తామని తెలిపారు. కళాశాల అధ్యాపకులు హోళగుంద పోలీస్ స్టేషన్ చేపట్టిన ఈ కార్యక్రమాన్ని అభినందించారు.



