ఆస్పరిలో పోలీసుల వేధింపులు దారుణం
1 min read
బాధ్యులపై చర్యలు తీసుకునే వరకు పోరాటం: ఎమ్మెల్యే బుసినే విరూపాక్షి
ఆలూరు న్యూస్ నేడు: ఆలూరు నియోజకవర్గంలోని ఆస్పరి మండల కేంద్రంలో పోలీసుల వేధింపులు తాళలేక పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడి, ఆదోని ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న హనుమంతు రెడ్డిని ఆలూరు ఎమ్మెల్యే బుసినే విరూపాక్షి పరామర్శించారు.అనంతరం నిర్వహించిన మీడియా సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ, రాష్ట్రంలో పోలీసు వ్యవస్థ ప్రజల విశ్వాసాన్ని కోల్పోయే విధంగా వ్యవహరిస్తోందని విమర్శించారు. ఆస్పరిలో జరిగిన ఘటనలో పోలీసుల వైఖరిపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు.హనుమంతు రెడ్డి ఆత్మహత్యాయత్నానికి దారితీసిన పరిస్థితులపై సమగ్ర విచారణ జరిపి, బాధ్యులైన పోలీసు అధికారులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అలాగే, పోలీసులను ప్రశ్నించిన మహిళలపై కూడా దౌర్జన్యంగా ప్రవర్తించడం ప్రజాస్వామ్యానికి విరుద్ధమని పేర్కొన్నారు.ఈ ఘటన రాష్ట్రంలో శాంతిభద్రతల పరిస్థితిపై అనేక ప్రశ్నలు లేవనెత్తుతోందని, బాధ్యులపై చర్యలు తీసుకునే వరకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తరఫున ప్రజాస్వామ్యబద్ధంగా పోరాటం కొనసాగిస్తామని ఎమ్మెల్యే స్పష్టం చేశారు.ఈ కార్యక్రమంలో మండల కన్వీనర్, రాష్ట్ర మరియు జిల్లా కమిటీ సభ్యులు, నియోజకవర్గ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అనుబంధ విభాగాల ప్రతినిధులు పాల్గొన్నారు.


