మొబైల్ టవర్లను త్వరగా ఏర్పాటు చేయండి
1 min read

మంత్రి పెమ్మసానితో ఎంపీ పుట్టా మహేష్ కుమార్
సిగ్నల్ సమస్యలతో గ్రామీణ ప్రాంతాల్లో సమస్యలు
బిఎస్ఎన్ఎల్ కొత్త టవర్లు త్వరగా ఏర్పాటు చేయాలి
కేంద్ర మంత్రి పెమ్మసానికి ఏలూరు ఎంపీ విజ్ఞప్తి
ఏలూరుజిల్లా ప్రతినిధి,న్యూస్ నేడు: ఏలూరు పార్లమెంట్ పరిధిలో ఎప్పటినుంచో పెండింగ్ లో ఉన్న బిఎస్ఎన్ఎల్ మొబైల్ టవర్ల ఏర్పాటు అంశంపై అధికారులకు వెంటనే ఆదేశాలు జారీచేయాల్సిందిగా కేంద్ర కమ్యూనికేషన్ల సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ ను ఏలూరు ఎంపీ పుట్టా మహేష్ కుమార్ కోరారు. శుక్రవారం పార్లమెంటులో కేంద్ర మంత్రిని కలిసిన ఏలూరు ఎంపీ, ఏలూరు పార్లమెంట్ పరిధిలో కొన్ని ప్రాంతాలలో మొబైల్ నెట్వర్క్ కవరేజ్ సరిగా లేని విషయాన్ని, కొత్త మొబైల్ టవర్లు ఏర్పాటు చేయవలసిందిగా గతంలోని కోరగా, కేంద్రం అంగీకరించిన విషయాన్ని కూడా ఎంపీ మంత్రి పెమ్మసానికి గుర్తు చేశారు. సిగ్నల్ నెట్ వర్క్, కనెక్టివిటీ సమస్యల వల్ల ఈ గవర్నెన్స్ సహా బ్యాంకింగ్ సేవలు మరియు ఇతర ప్రభుత్వ, ప్రజా అవసరాలు, గ్రామీణ అభివృద్ధి సేవలు ప్రభావితం అవుతున్న విషయాన్ని ఎంపీ పుట్టా మహేష్ కుమార్ కేంద్రమంత్రికి వివరించారు. అనేక గ్రామీణ, సెమీ అర్బన్ మండలాల్లో కొత్త బిఎస్ఎన్ఎల్ టవర్లు ఏర్పాటు చేయడానికి ప్రతిపాదనలు కేంద్ర స్థాయిలో ఆమోదం కోసం చాలా కాలంగా పెండింగ్లో ఉన్న విషయాన్ని ఎంపీ పుట్టా మహేష్ కుమార్ కేంద్ర మంత్రి దృష్టికి తీసుకువచ్చారు.ఎంపీ పుట్టా మహేష్ కుమార్ విజ్ఞప్తిపై సానుకూలంగా స్పందించిన మంత్రి పెమ్మసాని వీలైనంత త్వరలో మొబైల్ టవర్ల ఏర్పాటుకు చర్యలు తీసుకుంటానని హామీ ఇచ్చారు. ఎంపీ కృషితో తొందరలోనే ఏలూరు పార్లమెంటు పరిధిలో ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో సిగ్నల్ సమస్యలు పరిష్కారం అవుతాయని భావిస్తున్నారు.

