చట్టసభల్లో ఓబీసీలకు రిజర్వేషన్లు ఇవ్వాలి
1 min read

– రిటైర్డ్ డీజీపీ ఏఐబీఎస్పీ జాతీయ సమన్వయకర్త జే పూర్ణచందర్రావు
– ఇండిపెండెంట్ కెనరా బ్యాంక్ ఓబీసీ ఉద్యోగుల సంక్షేమ సంఘం మొదటి సర్వసభ సమావేశం విజయవంతం
కర్నూలు, న్యూస్ నేడు:‘కెనరా బ్యాంకు ఓబీసీ ఉద్యోగులు ప్రమోషన్లలో రిజర్వేషను , క్రీమీ లేయర్ తొలగింపు మరియు ఇతర డిమాండులు నెరవేరక పోవడానికి ప్రధాన కారణం చట్టసభలో కేవలం 24 శాతం ఎంపీలు ఉండడం కారణం. రాజ్యాధికారం కోసం ఉద్యమించాలి. ఓబీసీల్లో చైతన్యం వెల్లివిరుస్తోన్న ప్రస్తుత తరుణంలో ప్రతి బీసీలో తమ వెనుకబాటుతనానికి కారణమేమిటన్న ఆలోచనల కదలిక వస్తోంది.’ ఈ నేపథ్యంలో దేశవ్యాప్తంగా అన్ని రంగాల్లో ఉన్న ఓ బీసీలు చైతన్యం కావాలని రిటైర్డ్ డీజీపీ ఏఐబీఎస్పీ జాతీయ సమన్వయకర్త జే పూర్ణచందర్రావు పిలుపునిచ్చారు. ఇండిపెండెంట్ కెనరా బ్యాంక్ ఓబీసీ ఉద్యోగుల సంక్షేమ సంఘం మొదటి సర్వసభ సమావేశం ఆదివారం కర్నూలు పట్టణంలోని ఓ ప్రైవేటు హోటల్లో జరిగింది. ఈ కార్యక్రమానికి రిటైర్డ్ డైరక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్, ఏఐబీఎస్పీ జాతీయ సమన్వయకర్త జె. పూర్ణచంద్రరావు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘ఆంధ్రప్రదేశ్ లో బీసీల జనాభా ముస్లింలను మినహాయిస్తే 45 శాతం ఉంది . కానీ ఆంధ్రప్రదేశ్ శాసనసభలో 175 మంది ఎమ్మెల్యేలు ఉంటే అందులో బీసీల ఎమ్మెల్యేలు ఉన్నది 40 మంది మాత్రమే. ఏపీ కేబినెట్ లో 26 మంది మంత్రులు ఉంటే కేవలం బీసీ మంత్రులు ఎనిమిది మంది మాత్రమే. ఇక బీసీలకు రాష్ట్రంలో ఎక్కడ న్యాయం జరుగుతుందో చెప్పాలి. నాడు మండల్ కమిషన్ కోసం బీసీలు ఆందోళన చేస్తే.. వెంటనే బీజేపీ ఎల్ కే అద్వానీ సారథ్యంలో రాముడు పేరుతో కమండల్ రథయాత్ర చేసి పక్కదారి పట్టించారు . బీసీల గురించి ఏ పార్టీ కూడా ఉద్యమించలేదు ఎందుకంటే అవి కమ్మ రెడ్డి నాయకుల పార్టీలు. ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ 10 రోజుల్లో 10% ఎంత వేగంగా ఇచ్చిండ్రు అనేదే అగ్రవర్ణ పార్టీల ఆధిపత్యానికి నిదర్శనం..’ అని పూర్ణచంద్రరావు గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో ఓబీసీ జాతీయ నాయకులు & రాజ్యసభ సభ్యులు ఆర్. కృష్ణయ్య, ఆంధ్రప్రదేశ్ కర్నూలు మాజీ ఎంపీ సంజీవ్ కుమార్ సింగారి బ్యాంకు ఉద్యోగులు తదితరులు పాల్గొన్నారు.


