హోళగుంద లో వ్యవసాయ ఇన్‌పుట్ డీలర్లతో సమీక్ష సమావేశం
1 min read
యూరియా, డీఏపీ విక్రయాల్లో నిబంధనలు తప్పనిసరిగా పాటించాలి – మండల వ్యవసాయ అధికారి ఆనంద్ లోకదళ్ హెచ్చరిక
హోళగుంద న్యూస్ నేడు: హోళగుందమండలంలోని ఎరువులు, పురుగుమందులు, విత్తనాల వ్యాపారుల (అగ్రి డీలర్లు)తో మండల వ్యవసాయ అధికారి ఆనంద్ లోకదళ్ అధ్యక్షతన గురువారం సమీక్ష సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా వ్యవసాయ అధికారి మాట్లాడుతూ రైతులకు నాణ్యమైన వ్యవసాయ ఇన్‌పుట్లు అందించడంతో పాటు ప్రభుత్వ నిబంధనలను ప్రతి డీలర్ తప్పనిసరిగా పాటించాలని సూచించారు.మండలంలో రైతుల అవసరాలకు అనుగుణంగా యూరియా, డీఏపీ ఎరువులను తగినంత నిల్వ ఉంచాలని, గరిష్ట చిల్లర ధర (ఎంఆర్పీ) కంటే అధిక ధరలకు విక్రయించరాదని స్పష్టం చేశారు.యూరియా, డీఏపీ విక్రయాలు తప్పనిసరిగా ఆంధ్రప్రదేశ్ అగ్రికల్చర్ ఇన్ఫర్మేషన్ మేనేజ్‌మెంట్ సిస్టమ్ (APAIMS 2.0) యాప్ ద్వారానే నిర్వహించాలని తెలిపారు. విక్రయాల సమయంలో రైతుల నుంచి కేవలం ఆధార్ కార్డు లేదా ఆధార్ నంబర్ మాత్రమే తీసుకోవాలని, పట్టాదారు పాస్‌బుక్ అవసరం లేదని వివరించారు.రైతులకు విక్రయించిన ప్రతి యూరియా, డీఏపీ సంచిని అదే రోజు APAIMS 2.0 మరియు డీబీటీ వ్యవస్థల్లో నమోదు చేయాలని ఆదేశించారు. రైతులకు తప్పనిసరిగా బిల్లు ఇవ్వాలని, ఆ బిల్లుపై రైతు సంతకం ఉండేలా చూడాలని సూచించారు.ప్రతి డీలర్ తమ దుకాణంలో ధరల పట్టిక, నిల్వల పట్టికలు, సంబంధిత రికార్డులను ప్రతిరోజూ నవీకరించుకోవాలని తెలిపారు. నకిలీ విత్తనాలు, పురుగుమందులు లేదా బయో ఉత్పత్తులను విక్రయిస్తే సంబంధిత డీలర్లపై క్రిమినల్ కేసులు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.అదేవిధంగా ప్రతి నెల 5వ తేదీలోగా విక్రయాల నివేదికను మండల వ్యవసాయ అధికారి కార్యాలయానికి సమర్పించాలని సూచించారు. ప్రభుత్వ నిబంధనలను ఉల్లంఘించిన ప్రైవేట్ డీలర్లపై చట్టపరమైన చర్యలు తప్పవని స్పష్టం చేశారు.ఈ సమావేశంలో మండలంలోని ఎరువులు, పురుగుమందులు, విత్తనాల వ్యాపారులు, వ్యవసాయ శాఖ సిబ్బంది పాల్గొన్నారు.


