NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

డాక్యుమెంట్ రిజిస్ట్రేషన్ ప్రైవేటీకరణను వెంటనే రద్దు చేయాలి

1 min read

– వైఎస్సార్సీపీ జిల్లా ఉపాధ్యక్షుడు ఎస్.కె. గిరి

హోళగుంద న్యూస్ నేడు: డాక్యుమెంట్ రిజిస్ట్రేషన్ సేవలను ప్రైవేటీకరించడం ద్వారా ఉపాధి కోసం ఎన్నో సంవత్సరాలుగా పనిచేస్తున్న డాక్యుమెంట్ రైటర్ల జీవనోపాధిపై తీవ్ర ప్రభావం పడుతుందని వైఎస్సార్సీపీ జిల్లా ఉపాధ్యక్షుడు ఎస్.కె. గిరి పేర్కొన్నారు.డాక్యుమెంట్ రైటర్లకు మద్దతుగా నిర్వహించిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ, రాష్ట్రంలో కొత్త ఉద్యోగాలు కల్పించడంలో విఫలమైన చంద్రబాబు ప్రభుత్వం, ప్రస్తుతం పొట్టకూటి కోసం పనిచేస్తున్న డాక్యుమెంట్ రైటర్ల ఉపాధినే దెబ్బతీసేలా రిజిస్ట్రేషన్ సేవలను ప్రైవేటీకరించడం అన్యాయమని విమర్శించారు.రిజిస్ట్రేషన్ సేవలను ప్రైవేటు సంస్థలకు అప్పగిస్తే, ప్రజలు ముందుగా ప్రైవేటు సేవా కేంద్రాల్లో డాక్యుమెంట్ల పరిశీలన చేయించుకుని దానికి ప్రత్యేకంగా వేల రూపాయలు చెల్లించాల్సి వస్తుందని తెలిపారు. అనంతరం రిజిస్ట్రేషన్ కార్యాలయంలో మార్కెట్ విలువ ఆధారంగా మరోసారి ప్రభుత్వ చలానా చెల్లించి రిజిస్ట్రేషన్ పూర్తి చేయాల్సి ఉంటుందని అన్నారు. దీంతో ప్రజలపై అదనపు ఆర్థిక భారం పడటమే కాకుండా, రిజిస్ట్రేషన్ ప్రక్రియ మరింత ఖరీదైనదిగా మారుతుందని ఆందోళన వ్యక్తం చేశారు.అందువల్ల డాక్యుమెంట్ రిజిస్ట్రేషన్ ప్రైవేటీకరణ నిర్ణయాన్ని వెంటనే ఉపసంహరించుకోవాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ప్రజలు, డాక్యుమెంట్ రైటర్లు అప్రమత్తంగా ఉండి ఈ నిర్ణయాన్ని వ్యతిరేకించాలని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో కన్వీనర్ మల్లికార్జున, మల్లప్ప, రాముడు, ఏరన్న తదితరులు పాల్గొన్నారు.

About Author