NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

మహిళా ఉద్యమాలకు మార్గదర్శి సావిత్రి బాయి పూలే

1 min read

దేశంలో స్త్రీలపై జరుగుతున్న వివక్షలను ధిక్కరించిన ధీర వనిత సావిత్రి బాయి పూలే

ఆంధ్రప్రదేశ్ మహిళా సమాఖ్య (ఎన్.ఎఫ్.ఐ.డబ్ల్యూ) ఏలూరు ఏరియా సమితి అధ్యక్ష, కార్యదర్శులు కొండేటి బేబీ,అడ్డగర్ల లక్ష్మీ ఇందిరా

ఏలూరుజిల్లా ప్రతినిధి,న్యూస్ నేడు: ఆంధ్రప్రదేశ్ మహిళా సమాఖ్య (ఎన్.ఎఫ్.ఐ.డబ్ల్యూ) ఆధ్వర్యంలో సావిత్రి బాయి పూలే 128వ వర్ధంతి కార్యక్రమాన్ని ఏలూరు,ఆర్.ఆర్.పేట, స్ఫూర్తి భవన్ నందు నిర్వహించారు.సావిత్రిబాయి పూలే చిత్రపటానికి కొండేటి బేబీ పూల మాల వేయగా,కార్యక్రమంలో పాల్గొన్న వారు చిత్ర పటానికి పూలు వేసి నివాళులర్పించారు. జోహార్ సావిత్రిబాయి పూలే, సాధిస్తాం సాధిస్తాం సావిత్రిబాయి పూలే ఆశయాలను, వర్ధిల్లాలి ఆంధ్రప్రదేశ్ మహిళా సమాఖ్య అంటూ నినాదాలు చేశారు.ఈ సందర్భంగా కొండేటి బేబీ అడ్డగర్ల లక్ష్మి ఇందిరా మాట్లాడుతూ సావిత్రిబాయి పూలే భారత దేశంలో మహిళలపై జరుగుతున్న సామాజిక వివక్షకు వ్యతిరేకంగా ఉద్యమాలకు పునాది వేసి, మహిళలకు విద్య హక్కు కల్పించి, సమాజంలో సమానత్వం తీసుకురావడానికి తన జీవితాంతం కృషి చేసిన గొప్ప వ్యక్తి అని కొనియాడారు. అనాధ పిల్లల కోసం ఆశ్రమాలను స్థాపించి వారికి ఆశ్రయం కల్పించారని, ఆ కాలంలో దేశంలో మహిళలు చదువుకోవడాన్ని నేరంగా చూసేవారని వారిని ఎదురించి, సావిత్రీ బాయి పూలే పాఠశాలకు వెళ్తున్నప్పుడు ఆమెపై రాళ్లు, మట్టి వేస్తూ అవమానాలు చేసినా ఆమె తన లక్ష్యాన్ని వదలకుండా మహిళలకు విద్య అందించడానికి మహోన్నత కృషి చేశారని కొనియాడారు. 1848లో సావిత్రిబాయి పూలే మరియు జ్యోతి రావు పూలే కలిసి పుణేలో బాలికల కోసం దేశంలో మొట్ట మొదటి పాఠశాలను ప్రారంభించారని తెలిపారు.1897లో ప్లేగు మహమ్మారి వ్యాధి వ్యాప్తి సమయంలో రోగులకు సేవ చేస్తూనే ఆమె కూడా ఆ వ్యాధికి గురై మార్చి 10,1897న మరణించారు.తాను నమ్మిన మార్పు కోసం ప్రజలకు సేవ చేస్తూనే ఆమె తన ప్రాణాలు అర్పించడం ఆమె గొప్ప త్యాగానికి నిదర్శనమన్నారు.సావిత్రిబాయి పూలే వర్ధంతి సందర్భంగా ఆమె ఆలోచనలు, ఆదర్శాలను స్మరించుకుంటూ, దేశంలో మహిళలపై పెరుగుతున్న దాడులు, హింసకు వ్యతిరేకంగా ఉద్యమాలను నిర్వహించడమే సావిత్రిబాయి పూలేకు అర్పించే ఘనమైన నివాళి అని,ఈ పోరాటాలలో మహిళలందరూ పాల్గొనాలని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో ఏలూరు ఏరియా సహాయ కార్యదర్శి కొల్లూరి సుధారాణి, జిల్లా సహాయ కార్యదర్శి గొర్లి స్వాతి, ఏలూరు ఏరియా కౌన్సిల్ సభ్యులు ఉప్పులూరి లక్ష్మి, భవాని, వెదురుపర్తి శారద,రంగమ్మ తదితరులు పాల్గొన్నారు.

About Author