ఎస్సీ,ఎస్టీ సబ్ ప్లాన్ నిధులను సక్రమంగా వినియోగించాలి
1 min read

దళితులపై జరుగుతున్న దాడులను,అత్యాచారాలను అరికట్టాలి
దళిత హక్కుల పోరాట సమితి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కరవది సుబ్బారావు
ఏలూరుజిల్లా ప్రతినిధి,న్యూస్ నేడు: దళిత హక్కుల పోరాట సమితి జిల్లా స్థాయి సమావేశం ఆర్ ఆర్ పేట స్ఫూర్తి భవన్ నందు ఉప్పులూరి హేమ శంకర్ అధ్యక్షతన జరిగినది.ఈ సమావేశానికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన దళిత హక్కుల పోరాట సమితి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కరవది సుబ్బారావు మాట్లాడుతూ రాష్ట్ర కేంద్ర బడ్జెట్లో ఎస్సీ ఎస్టీ సబ్ ప్లాన్ కు కేటాయించిన నిధులను ఆ వర్గాలకు సక్రమంగా ఖర్చు చేయడం లేదని ఆరోపించారు. బడ్జెట్లో కేటాయింపులకు ఎస్సీ ఎస్టీల అభివృద్ధికి తీసుకుంటున్న చర్యలకు పొంతన ఉండడం లేదని ఎద్దేవా చేశారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిధుల కేటాయింపులో నిర్లక్ష్యం వాటిని సక్రమంగా అమలు చేయడంలో అలసత్వం చేస్తున్నారని మండిపడ్డారు. రాష్ట్రంలో 17 శాతం జనాభాగా ఉన్న దళితులు ఇంకా దారిద్ర్యరేఖకు దిగువనే జీవిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. దేశంలో ఏదో ఒకచోట దళితులపై దాడులు అత్యాచారాలు జరుగుతున్నాయని విచారం వ్యక్తం చేశారు. దళితులకు ఉన్న చట్టాలను పటిష్టంగా అమలు జరిపి దళితులపై దాడులను నివారించాలని డిమాండ్ చేశారు. ఎస్సీ ఎస్టీ సబ్ ప్లాన్ నిధులను ఆ వర్గాలకు సక్రమంగా ఖర్చు చేయాలని లేని పక్షంలో భవిష్యత్తులో దళితులను,దళితులకు అండగా నిలిచే సంఘాలను కలుపుకొని పోరాటాలను ఉదృతం చేస్తామని హెచ్చరించారు.ఈ సమావేశంలో భజంత్రీ శ్రీనివాసరావు, గుమ్మడి లక్ష్మీ నారాయణ, కొండేటి రాంబాబు, ఆలూరి ప్రభాకర్, జిజ్జివరపు రాజేంద్ర, తొమ్మండ్రు శివ, ఆలూరి రమేష్, జిజ్జువరపు సురేంద్ర, వంశీ, తదితరులు పాల్గొన్నారు.

