(సర్) ప్రత్యేక శిబిరాల నిర్వహణను క్షేత్రస్థాయిలో పరిశీలించిన జాయింట్ కలెక్టర్
1 min read
స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (SIR) ప్రక్రియను పారదర్శకంగా, నిష్పక్షపాతంగా, నిర్ణీత గడువులో పూర్తి చేయాలి
డిజిటైజేషన్ ప్రక్రియను త్వరితగతిన పూర్తి చేయాలి.
జాయింట్ కలెక్టర్ నూరుల్ ఖమర్
కర్నూలు, న్యూస్ నేడు: స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (SIR) కార్యక్రమాన్ని పారదర్శకంగా, నిష్పక్షపాతంగా, వేగవంతంగా పూర్తి చేసి, అర్హులైన ప్రతి ఒక్కరి పేరు ఓటరు జాబితాలో నమోదయ్యేలా అధికారులు ప్రత్యేక శ్రద్ధతో పనిచేయాలని జాయింట్ కలెక్టర్ నూరుల్ ఖమర్ ఆదేశించారు.సోమవారం జిల్లాలో స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (SIR) కార్యక్రమంలో భాగంగా ఓర్వకల్లు మండలంలోని నన్నూరు, కల్లూరు మండలం లోని నాగేంద్రనగర్ సచివాలయం 94, వీకర్ సెక్షన్స్ కాలనీలోని సచివాలయం 97 లలో ఏర్పాటు చేసిన ప్రత్యేక శిబిరాలను జాయింట్ కలెక్టర్ సందర్శించారు. స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (SIR) ప్రత్యేక శిబిరాలను జాయింట్ కలెక్టర్ సందర్శించి అక్కడి ఏర్పాట్లను పరిశీలించారు. ప్రజలు సమర్పించే ధ్రువపత్రాలను నిబంధనల ప్రకారం పరిశీలించి వెంటనే సంబంధిత పోర్టల్లో డిజిటైజ్ చేయాలని, ఎలాంటి జాప్యం లేకుండా ఆన్లైన్లో నమోదు ప్రక్రియను పూర్తి చేయాలని సూచించారు. గ్రామాలు, వార్డులు, కాలనీల్లో విస్తృత ప్రచారం నిర్వహించి అర్హులైన ప్రతి ఓటరు ఈ అవకాశాన్ని వినియోగించుకునేలా చర్యలు చేపట్టాలని అధికారులకు సూచించారు. స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ప్రక్రియలో అధికారులు, బూత్ లెవల్ అధికారులు (BLOలు), సిబ్బంది సమన్వయంతో పనిచేసి ఎలాంటి ఫిర్యాదులకు తావులేకుండా ఎన్నికల సంఘం మార్గదర్శకాలను కచ్చితంగా అమలు చేయాలని, నిర్ణీత గడువులోపు ప్రక్రియను పూర్తి చేయాలని జాయింట్ కలెక్టర్ ఆదేశించారు. ప్రతి బి.ఎల్.ఓకు సహాయకులుగా ఐసీడీఎస్,మెప్మా, డ్వామా, డీఆర్డీఏ తదితర శాఖల నుంచి సిబ్బందిని కేటాయించడం జరిగిందని, వారి సేవలను వినియోగించుకుని సర్ ప్రక్రియను వేగవంతంగా పూర్తి చేయాలని జేసీ ఆదేశించారు.

