‘ఎస్‌ఐఆర్’ వేగవంతానికి ప్రత్యేక చర్యలు
1 min read
కర్నూలు ఈఆర్వో, కమిషనర్ చల్లా ఓబులేసు
శని, ఆదివారాల్లో స్పెషల్ క్యాంపెయిన్
కర్నూలు, న్యూస్ నేడు: శుక్రవారం ప్రత్యేక ఓటరు జాబితా సవరణ (స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ – ఎస్‌ఐఆర్) ప్రక్రియను వేగవంతం చేయాలని ఎలెక్టోరల్ రిజిస్ట్రేషన్ అధికారి, నగరపాలక కమిషనర్ చల్లా ఓబులేసు పేర్కొన్నారు. శుక్రవారం ఆయన బుధవారపేట 122, 123, 124, ఖల్లా 192, 193 పోలింగ్ కేంద్రాల పరిధిలో జరుగుతున్న ఎస్‌ఐఆర్ ప్రక్రియను పరిశీలించారు. ప్రజలకు ఎస్‌ఐఆర్‌పై అవగాహన కల్పించి, 2002 ఓటరు జాబితాను 2026 జాబితాతో సరిపోల్చి, స్వయంగా ఎన్యూమరేషన్ ఫారాలు పూరించారు. రాజకీయ పార్టీల బూత్ లెవల్ ఏజెంట్ల సహకారం తీసుకోవాలని, క్షేత్రస్థాయిలో పర్యటిస్తున్నప్పుడు వారికి ముందస్తు సమాచారం ఇవ్వాలని ఈఆర్వో, బిఎల్వోలకు సూచించారు.ఈ సందర్భంగా ఈఆర్వో మాట్లాడుతూ.. కేంద్ర ఎన్నికల సంఘం దేశవ్యాప్తంగా చేపట్టిన ఎస్‌ఐఆర్ ప్రక్రియను సమర్థవంతంగా నిర్వహించేందుకు ప్రతి ఒక్కరూ తమ వంతు సహకారం అందించాలని కోరారు. ఎస్‌ఐఆర్‌లో ఎన్యూమరేషన్ ఫారాల అందజేత, డిజిటలైజేషన్ ప్రక్రియకు గడువు సమీపిస్తున్న నేపథ్యంలో ఎస్‌ఐఆర్ ప్రక్రియను వేగవంతం చేసినట్లు పేర్కొన్నారు. విద్యావంతులు, ప్రభుత్వ, ప్రైవేటు రంగాల ఉద్యోగులు ఎస్‌ఐఆర్ ప్రక్రియలో భాగస్వామ్యం కావొచ్చని, తమ వీధిలో ఉన్న ఓటర్లకు ఎన్యూమరేషన్ ఫారాలు పూరింపులో సహకారం అందించాలని కోరారు. ఇతర ప్రాంతాల్లో ఉన్న ఓటర్లకు ఇరుగుపొరుగున ఉన్న వారు సమాచారం అందించాలని, అర్హులైన ప్రతి ఓటరు ఎస్‌ఐఆర్ ప్రక్రియలో భాగస్వామి కావాలని సూచించారు.అదేవిధంగా ఈ శని, ఆదివారాల్లో అన్ని పోలింగ్ కేంద్రాల పరిధిలో స్పెషల్ క్యాంపెయిన్ నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు బీఎల్‌వోలు, సూపర్వైజర్లు, ఎస్‌ఐఆర్ ప్రక్రియకు సంబంధించిన సందేహాలను నివృత్తి చేయడం, ఎన్యూమరేషన్ ఫారాల పంపిణీ, సేకరణ, డిజిటలైజేషన్ ప్రక్రియలను చేపట్టనున్నట్లు చెప్పారు.కార్యక్రమంలో అసిస్టెంట్ ఈఆర్వో ధనుంజయ, సూపర్వైజర్లు వేణుప్రియ, రసూల్, బీఎల్‌వోలు తదితరులు పాల్గొన్నారు.


