విద్యార్థులు యువత గ్రంథాలయాలను సద్వినియోగం చేసుకోవాలి
1 min read

– మాజీ రాజ్యసభ సభ్యులు టీజీ వెంకటేష్
కర్నూలు, న్యూస్ నేడు: గ్రంథాలయాలు విజ్ఞాన భాండాగారాలని నేటి యువత వాటిని సద్వినియోగం చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని మాజీ రాజ్యసభ సభ్యులు టీజీ వెంకటేష్ అన్నారు. ఈరోజు నగరంలోని కేంద్ర గ్రంథాలయంలో 58వ గ్రంథాలయ వారోత్సవాల ముగింపు కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా టీజీ వెంకటేష్ మాట్లాడుతూ అప్పటి నాయకులు ఎంతో ముందు చూపుతో యువతకు విద్యతో పాటు, విజ్ఞానాన్ని అందించేందుకు గ్రంథాలయాలు ఏర్పాటు చేశారన్నారు. మారుతున్న కాలానికి అనుగుణంగా గ్రంధాలయాలలో అవసరమైన పుస్తకాలతో, ఈనాటి యువతకు అవసరమైన అన్ని రకాల సౌకర్యాలు కలిగి ఉన్నాయన్నారు. ముఖ్యంగా గ్రంథాలయాలలో ఇంటర్నెట్, కంప్యూటర్ ల్యాబ్ ల ఏర్పాటుతో కాలానుగుణంగా విద్యార్థులు, యువత ప్రపంచంలో ఎక్కడ ఏమేమి జరుగుతున్నది వెంటనే తెలుసుకునే అవకాశం ఏర్పడింది అన్నారు. అనంతరం గ్రంథాలయ వారోత్సవాల సందర్భంగా విద్యార్థులకు నిర్వహించిన వ్యాసరచన పోటీలలో గెలుపొందిన వారికి ప్రశంస పత్రాలు బహుమతులను టీజీ వెంకటేష్ అందజేశారు. ఈ కార్యక్రమంలో పారిశ్రామికవేత్త బీవీ రెడ్డి, కె వి సుబ్బారెడ్డి, మాజీ గ్రంథాలయ చైర్మన్లు చంద్రశేఖర్ కల్కురా, కేజీ గంగాధర్ రెడ్డి, గ్రంథాలయ సంస్థ కార్యదర్శి పెద్దక్క తదితరులు పాల్గొన్నారు.


