రోడ్డు ప్రమాదాల నివారణకు కేంద్రం చర్యలు తీసుకోవాలి
1 min read

ఏలూరు ఎంపీ పుట్టా మహేష్ కుమార్
లిఖిత పూర్వకంగా అంగీకరించిన కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ
ఏలూరుజిల్లా ప్రతినిధి న్యూస్ నేడు : ఏపీలోని గన్నవరం-నల్లజెర్ల మధ్య జాతీయ రహదారి-16పై రోడ్డు ప్రమాదాల నివారణకు కేంద్ర ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంటుందని పార్లమెంట్ వర్షాకాలం సమావేశాల సందర్భంగా ఏలూరు ఎంపీ పుట్టా మహేష్ కుమార్ లోక్ సభలో అడిగిన ప్రశ్నకు కేంద్ర రోడ్డు రవాణా మరియు హైవేల మంత్రి నితిన్ గడ్కరీ శుక్రవారం లిఖిత పూర్వకంగా సమాధానం ఇచ్చారు.గన్నవరం నుండి నల్లజెర్ల వరకు జాతీయ రహదారి-16పై సగటున ప్రతి రోజు రోడ్డు ప్రమాదం జరుగుతున్న విషయం కేంద్ర ప్రభుత్వం దృష్టికి రాలేదని, రాష్ట్రాలు మరియు కేంద్ర పాలిత ప్రాంతాల నుండి సమీకరించిన సమాచారం ఆధారంగా ‘భారతదేశంలో రోడ్డు ప్రమాదాలు’ అనే వార్షిక నివేదిక రూపొందిస్తున్నట్లు కేంద్ర మంత్రి తెలిపారు. గత ఐదేళ్లలో గన్నవరం – నల్లజెర్ల మార్గంలో మొత్తం 1614 ప్రమాదాలు,254 మరణాలు సంభవించినట్లు నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా నివేదికలో పేర్కొందని కేంద్ర మంత్రి వెల్లడించారు.గన్నవరం,నల్లజెర్ల మధ్య మార్గాన్ని కాంట్రాక్టర్లు, కన్సెషనర్లు ఒప్పంద నిబంధనల ప్రకారం ట్రాఫిక్‌కు అనువుగా నిర్వహిస్తున్నారని, కొన్ని చోట్ల భూముల సెటిల్‌మెంట్లు ఏర్పడినప్పుడు వెంటనే వాటిని సరి దిద్దే చర్యలు తీసుకుంటున్నారని కేంద్ర మంత్రి బదులిచ్చారు.ప్రమాదాలను నివారించడానికి సైన్ బోర్డులు, స్పీడ్ బ్రేకర్లు, భద్రతా వంటి అవగాహన కార్యక్రమాలు కార్యక్రమాలు చేపడుతున్నారని, జిల్లా పోలీసు శాఖ, పరిపాలనా అధికారులతో కలిసి రోడ్డు భద్రతపై పర్యవేక్షణ కొనసాగిస్తున్నారని, ప్రయాణికుల భద్రతకు ప్రాధాన్యత ఇస్తూ నిరంతరంగా సమర్థవంతమైన చర్యలు తీసుకుంటుందని కేంద్ర మంత్రి స్పష్టం చేసినట్లు తెలిపారు.

