ప్రజలకు అందుబాటులో ఉండి మెరుగైన సేవలు అందించాలి
1 min read
స్వర్ణ వార్డు కార్యాలయాల ఆకస్మిక తనిఖీ – రికార్డుల నిర్వహణ, ప్రజా సేవలపై సమీక్ష
జిల్లా కలెక్టర్ డాక్టర్ ఏ. సిరి
కర్నూలు, న్యూస్ నేడు: ప్రజలకు అందుబాటులో ఉండి మెరుగైన సేవలు అందించాలని స్వర్ణ వార్డు కార్యాల సిబ్బందికి జిల్లా కలెక్టర్ పేర్కొన్నారు. గురువారం గూడూరు మండల కేంద్రంలోని 4వ మరియు 6వ స్వర్ణ వార్డు కార్యాలయాలను జిల్లా కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేసి అక్కడ అందిస్తున్న సేవలు, నిర్వహణ విధానాలను పరిశీలించారు. ఈ సందర్భంగా కార్యాలయ పరిసరాల పరిశుభ్రత, ప్రజలకు అందిస్తున్న సేవలు, ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాల అమలు తీరుపై సిబ్బందిని ప్రశ్నించి వివరాలు తెలుసుకున్నారు.ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్… నవచేతన యాప్ ద్వారా నిర్వహిస్తున్న AI-ఆధారిత ECD స్క్రీనింగ్ కార్యక్రమం అమలు 0–6 సంవత్సరాల వయస్సు గల చిన్నారులలో ఆరోగ్య మరియు అభివృద్ధి లోపాల గుర్తింపు, అండర్ వెయిట్ పిల్లల వివరాలు, గర్భిణీల నమోదు, రక్తపోటు మరియు మధుమేహ పరీక్షలు, యోగాంధ్ర నమోదు ప్రక్రియ, గృహ నిర్మాణాల పురోగతి, ఈ-కేవైసీ నిర్వహణ తదితర అంశాలపై సిబ్బందిని ప్రశ్నించి సమగ్ర సమాచారం సేకరించారు.ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ.. ప్రజలకు అత్యంత చేరువలో ఉండే స్వర్ణ వార్డు కార్యాలయాలు ప్రభుత్వ సేవల అందజేతలో కీలక పాత్ర పోషిస్తున్నాయని తెలిపారు. ప్రజలు కార్యాలయాలకు వచ్చినప్పుడు ఎటువంటి ఇబ్బందులు ఎదురుకాకుండా వెంటనే స్పందించి సేవలు అందించాలని సిబ్బందికి సూచించారు. అలాగే కార్యాలయ పరిసరాలను ఎల్లప్పుడూ పరిశుభ్రంగా ఉంచడంతో పాటు రికార్డులను సక్రమంగా నిర్వహించాలని ఆదేశించారు. తనిఖీలో భాగంగా మహిళా పోలీసు నిర్వహిస్తున్న కార్యక్రమాలపై కూడా కలెక్టర్ ఆరా తీశారు. “గుడ్ టచ్ – బ్యాడ్ టచ్” అవగాహన కార్యక్రమాల ద్వారా ఎంతమందికి అవగాహన కల్పించారో, వార్డు పరిధిలో ఉన్న టీనేజ్ బాలికల సంఖ్య ఎంత, వారికి సంబంధించిన రికార్డులు ఎందుకు నిర్వహించలేదని ప్రశ్నిస్తూ అసంతృప్తి వ్యక్తం చేశారు. టీనేజ్ బాలికలకు సంబంధించిన సమగ్ర రికార్డులను తప్పనిసరిగా నిర్వహించి, వారి విద్య, ఆరోగ్యం, భద్రత అంశాలపై నిరంతర పర్యవేక్షణ చేపట్టాలని సూచించారు.ఈ కార్యక్రమంలో కర్నూలు ఆర్డీవో సందీప్ కుమార్, స్వర్ణ గ్రామ, స్వర్ణ వార్డు ప్రత్యేక అధికారి భాస్కర్ నాయుడు, తహశీల్దార్ వెంకటేష్ నాయక్, తదితరులు పాల్గొన్నారు.


