బియ్యం లారీ ఆటో ను వెనకనుంచి ఢీ కొనడం తో ఇద్దరు మహిళలు, చిన్నారి మృతి
1 min read

పత్తికొండ, న్యూస్ నేడు: పత్తికొండ పట్టణంలో ఘోరం జరిగింది. పత్తికొండ పట్టణంలోని సాయిబాబా గుడి గేటు వద్ద ప్రయాణికులతో ఆగి ఉన్న ఆటోలను ప్రమాదవశాత్తు బియ్యం లారీ ఢీకొనడంతో ఇద్దరు మహిళలు, ఒక చిన్నారి దుర్మరణం చెందిన ఘటన చోటుచేసుకుంది. మంగళవారం సివిల్ సప్లై గోడౌన్ కు వెళ్తున్న బియ్యం లారీ ఎంపీడీవో ఆఫీసు మిట్ట వద్ద ఆగిపోయింది. ఆగిపోయిన బియ్యం లారీని మనుషులతో ముందుకు తోచి స్టార్ట్ చేసుకోవడానికి ప్రయత్నించిన లారీ డ్రైవర్ అదుపుతప్పి ఒక్కసారిగా వెనక్కు వచ్చింది. సాయిబాబా గుడి వద్ద ముక్కెళ్ళకు వెళ్తున్న ప్రయాణికులతో మూడు ఆటోలు ఆగి ఉన్నాయి. బియ్యం లారీ వెనకనుంచి ఒక్కసారిగా ఆగిన ఆటోలను రెప్పపాటులో ఢీ కొనడంతో ఇద్దరు మహిళలు ,ఒక చిన్నారి మృతి చెందారు. తుగ్గలి మండలం ముక్కెళ్ల గ్రామానికి చెందిన సుమన్ భార్య భూమిక (36) ,కుమార్తె నిఖిత (3), పవన్ భార్య శిరీష(35) లు మృతి చెందగా ఆరుగురు తీవ్రంగా గాయపడ్డారు. పండగ సరుకుల కోసం ముక్కెళ్ల నుండి పత్తికొండకు వెళ్లి అక్కడ బట్టలు, పండగ సరుకులు తీసుకుని ముక్కెళ్ల ఆటో స్టాండ్ లో ముక్కెళ్ల కు వెళ్లేందుకు వారు ఆటోలో కూర్చున్నారు. అయితే బియ్యం లారీ వెనకనుంచి ఆటో ను ఢీకొనడంతో ఆటో లో కూర్చున్న వారు దుర్మరణం చెందిన ఘటన పట్టణంలో తీవ్రంగా కలచి వేసింది. దీంతో కుటుంబ సభ్యులు, బంధువులు శోకసముద్రంలో మునిగి పోయారు. పండగ పూట ఈ ఘటన చోటు చేసుకోవడంతో ముక్కెళ్ల గ్రామంలో విషాద ఛాయలు అలముకున్నాయి. పోలీసులు దుర్ఘటన స్థలానికి చేరుకొని ఆటోలో చిక్కుకున్న మృతులను గాయపడిన వారిని బయటకు తీయించి స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మృతి చెందిన వారిని పోస్టుమార్టం కోసం తరలించారు. గాయపడిన వారిని ప్రధమ చికిత్స అనంతరం మెరుగైన వైద్యం కోసం తరలించారు.


