NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

16 ఏళ్ల బాలుడి కడుపులో ఫుట్‌బాల్ సైజ్ క‌ణితి

1 min read

విజ‌య‌వంతంగా క‌ణితి తొల‌గించిన కిమ్స్ సీత‌మ్మధార వైద్యులు

ఆరున్నర గంట‌ల‌కు పైగా సుదీర్ఘ శ‌స్త్రచికిత్స‌

విశాఖ‌ప‌ట్నం, న్యూస్​ నేడు : హాయిగా ఆడిపాడుతూ, ఎంచ‌క్కా చ‌దువుకునే వ‌య‌సు ఆ బాలుడిది. ప‌ద‌హారేళ్ల ప్రాయంలో ఉర‌క‌లెత్తే ఉత్సాహంతో ఉండాల్సిన ఆ బాలుడు కాస్తా దాదాపు నెల రోజుల నుంచి విప‌రీత‌మైన క‌డుపునొప్పితో బాధ‌ప‌డుతూ, త‌ర‌చు జ్వరం వ‌స్తుండ‌డంతో నీర‌సించిపోయాడు. వేరే ఆస్పత్రుల‌లో చూపించ‌గా.. కాలేయంలో ఇన్ఫెక్షన్ ఉంద‌ని మందులు వాడారు. అయినా ఫ‌లితం లేక‌పోవ‌డంతో విశాఖ‌ప‌ట్నంలోని కిమ్స్ సీత‌మ్మధార ఆస్పత్రికి తీసుకురాగా.. ఇక్కడ ప‌రీక్షలు చేస్తే అది కేన్సర్ అని తేలింది. అత‌డికి అరుదైన, సంక్లిష్టమైన శ‌స్త్రచికిత్స చేసి క‌ణితిని తొల‌గించిన సీనియ‌ర్ జీఐ, లివ‌ర్ స‌ర్జన్ డాక్టర్ ముర‌ళీధ‌ర్ నంబాడ ఈ కేసుకు సంబంధించిన వివ‌రాలు తెలిపారు. “ఆ బాలుడు ఇక్కడ‌కు వ‌చ్చేస‌రికే అత‌డికి పొట్ట బాగా ఉబ్బిపోయి ఉంది. దాంతో కాలేయంలో ఏదో ఇబ్బంది ఉంద‌ని గుర్తించాము. ప‌రీక్షలు చేయ‌గా అత‌డికి అత్యంత అరుదైన కాలేయ కేన్సర్ వ‌చ్చింద‌ని తెలిసింది. దాన్ని వైద్య ప‌రిభాష‌లో మాలిగ్నెంట్ హెపాటిక్ యాంజియో మైలోలిపోమా అంటారు. ఇది కాలేయంలో కుడివైపు దాదాపు స‌గ‌భాగాన్ని ఆక్రమించుకుని ఉంది. సీటీ స్కాన్, ఎంఆర్ఐ లాంటి ప‌రీక్షలు కూడా చేసి, క‌ణితి స‌రిగ్గా ఎక్కడినుంచి ఎక్కడివ‌ర‌కు ఉంది, ఏయే భాగాల‌ను ఆక్రమించింది, ఎలాంటి పొజిష‌న్‌లో ఉంద‌నే విష‌యాల‌ను గుర్తించాం. అనంత‌రం వెంట‌నే శ‌స్త్రచికిత్స చేయాల‌ని నిర్ణ‌యించాం. మొత్తం శ‌స్త్రచికిత్సకు దాదాపు ఆరున్నర గంట‌ల స‌మ‌యం ప‌ట్టింది. 4.5 కిలోల బ‌రువున్న ఆ క‌ణితి.. దాదాపు ఫుట్‌బాల్ ప‌రిమాణంలో ఉంది. ఇది చాలా పెద్ద క‌ణితి. ఇలాంటి దాన్ని ఎలాంటి స‌మ‌స్య‌లు లేకుండా తొల‌గించ‌డం కూడా చాలా క‌ష్టం. క‌ణితి నుంచి ఏమాత్రం ర‌క్తస్రావం కాకూడ‌దు. అలాగే క‌ణితి కూడా కాలేయంలో మిగ‌ల‌కుండా పూర్తిగా తొల‌గించాలి. అదే స‌మ‌యంలో ఆరోగ్యవంత‌మైన భాగాన్ని య‌థాత‌థంగా కాపాడుకోవాలి. ఎందుకంటే, కాలేయం అనేది మ‌న శ‌రీరంలో చాలా ముఖ్యమైన అవ‌య‌వం. రోగి వ‌య‌సు 16 సంవ‌త్సరాలే కాబ‌ట్టి, త‌ర్వాత కాలేయం పెరిగేందుకు అవ‌కాశం ఉంటుంది. అందువ‌ల్ల మిగిలిన కాలేయాన్ని కాపాడుకోవాలి. అయితే క‌ణితి ప‌రిమాణంతో పాటు అది ఉన్న ప్ర‌దేశం కూడా చాలా స‌మ‌స్యాత్మకం. దాంతో అత్యంత జాగ్రత్తగా ప్లాన్ చేసి, పూర్తి స్థాయి క‌చ్చిత‌త్వంతో శ‌స్త్రచికిత్స చేయాల్సి వ‌చ్చింది” అని డాక్టర్ ముర‌ళీధ‌ర్ వివ‌రించారు. శ‌స్త్రచికిత్స అనంత‌రం బాలుడు వేగంగా కోలుకోవ‌డంతో ఐదోరోజే డిశ్చార్జి చేశారు. ప్రస్తుతం కీమోథెర‌పీ ఆరు సైకిల్స్ కూడా పూర్తిచేసుకుని అత‌డు త‌న రోజువారీ కార్యక‌లాపాల‌ను సాధార‌ణంగానే చేసుకోగలుగుతున్నాడు. అత్యంత సంక్లిష్టమైన ఇలాంటి శ‌స్త్రచికిత్సల‌ను కూడా సీత‌మ్మధార‌లోని కిమ్స్ ఆస్పత్రిలో విజ‌య‌వంతంగా చేసి, త‌మ కుమారుడి ప్రాణాలు కాపాడినందుకు బాలుడి త‌ల్లిదండ్రులు ఆస్పత్రి వైద్యుల‌కు, సిబ్బందికి, యాజ‌మాన్యానికి కృత‌జ్ఞత‌లు తెలిపారు.

About Author