మండగిరిలో నీటి కొరత తీర్చండి….సిపిఎం
1 min read
న్యూస్ నేడు, పత్తికొండ: పత్తికొండ మండలం మండగిరి గ్రామం నందు తాగునీటి సమస్యను తీర్చాలని సిపిఎం ఆధ్వర్యంలో గ్రామంలో మంగళవారం నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమానికి రైతు సంఘం మండల కార్యదర్శి సిద్దయ్య గౌడ్ అధ్యక్షతన వహించగా, ముఖ్య అతిధులుగా సీనియర్ నాయకులు రంగారెడ్డి, సిఐటియు మండల కార్యదర్శి ఎం రవిచంద్ర పాల్గొని గ్రామంలోని ఎస్సీ కాలనీలో పర్యటించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, మండగిరి గ్రామం నందు తీవ్ర నీటి ఇబ్బందులు ఉన్నాయని వెంటనే మండల అధికారులు చర్యలు చేపట్టాలని ఈ సందర్భంగా కోరారు. గడచిన పది సంవత్సరాల నుండి ఎంతో తీవ్రంగా ఉన్న ఈ సమస్యను అటు అధికారులు గానీ ఇటు నాయకులు గాని పట్టించుకోకపోవడం దురదృష్టకరమని అన్నారు. ఎస్సీ కాలనీ లో పర్యటిస్తున్న సందర్భంగా అక్కడ ఉన్న గ్రామస్తులతో కాలనీవాసులతో సిపిఎం పార్టీ బృందం మాట్లాడారు. తీవ్ర నీటి సమస్యతో ఇబ్బంది పడుతున్న సందర్భంగా కనీసం రెండు మూడు రోజులకు ఒక్కసారైనా స్నానాలు చేయడానికి ఇబ్బందికరంగా ఉందని అర్ధరాత్రి 10 గంటలకు 12 గంటలకు ఓవర్ ట్యాంకులకు నీళ్లు వస్తే ఒక్కొక్కరికి రెండు మూడు కడవలు కూడా రాని పరిస్థితి అక్కడ ఉందని తెలిపారు. మహిళలు పూర్తిస్థాయిలో గొడవలకు దిగి ఆ నీళ్లు కాస్త బంద్ అయితే నిరాశతో వెనక్కి వెళ్లే పరిస్థితి ఏర్పడిందని తెలిపారు. ఈ గ్రామంలో ఎస్సీ కాలనీలో పారిశుద్ధ్యం కూడా పడక వేసిందని ఎక్కడ ఉన్న చెత్త అక్కడే పేరుకుపోవడం కనీసం వర్షాకాలం వస్తే కాలువల నుండి పూడిక తీసే పరిస్థితులు కూడా లేదని అన్నారు.

