చెరువుల్లోకి నీటి ప్రవాహం పెంపే లక్ష్యంగా పనులు వేగవంతం చేయండి
1 min read
జిల్లా కలెక్టర్ డా.ఏ.సిరి
కర్నూలు,న్యూస్ నేడు : చెరువుల్లోకి నీటి ప్రవాహం పెంపే లక్ష్యంగా కాలువలు శుభ్రపరిచే పనులు వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్ డా.ఏ.సిరి ఇరిగేషన్ అధికారులను ఆదేశించారు.మంగళవారం జలధార జలహారతి కార్యక్రమం కింద కర్నూలు మండలం తొలిసాపురం గ్రామం చెరువుకు సంబంధించిన కాలువలో జేసీబీ తో చేపట్టిన పనులను, తొలిసాపురం గ్రామ చెరువులో ఉపాధి హామీ శ్రామికులతో చేయిస్తున్న పూడిక తీత పనులను కలెక్టర్ పరిశీలించారు.ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ చెరువుల్లోకి వర్షపు నీరు సక్రమంగా చేరేలా కాలువల పూడికతీత పనులను వేగవంతంగా చేయాలని కలెక్టర్ ఇరిగేషన్ అధికారులను ఆదేశించారు. చెరువు కట్టపై పెరిగిన పిచ్చి చెట్లు, కంపలను కూడా తొలగించి చెరువు కట్టను పూర్తిగా కనిపించేలా చర్యలు తీసుకోవాలన్నారు. ప్రస్తుతం చెరువులోకి నీటిని తీసుకువచ్చే వంకలో పూడికతీత పనులు చేపట్టారని, ఇప్పటివరకు సుమారు 360 మీటర్ల మేర పనులు పూర్తయ్యాయని, మిగిలిన భాగాన్ని కూడా త్వరితగతిన పూర్తి చేయాలన్నారు. 21 ఎంసీఎఫ్టీ (మిలియన్ క్యూబిక్ ఫీట్) సామర్థ్యం కలిగిన తొలిసాపురం చెరువులో వర్షపు నీరు పూర్తిస్థాయిలో నిల్వ అయ్యేలా చర్యలు తీసుకుంటున్నామని కలెక్టర్ తెలిపారు. చెరువు పనులు పూర్తయిన అనంతరం మరో ప్రధాన కాలువలో కూడా పూడికతీత, శుభ్రపరిచే కార్యక్రమాలు చేపట్టనున్నట్లు కలెక్టర్ తెలిపారు. ప్రస్తుతం చేపట్టిన పనుల ఫలితంగా వర్షాకాలంలో నీటి ప్రవాహం మెరుగుపడి చెరువులు నిండడంతో పాటు రైతులకు సాగునీటి లభ్యత పెరుగుతుందని కలెక్టర్ ఆశాభావం వ్యక్తం చేశారు. సంబంధిత శాఖల అధికారులు పనులను నిరంతరం పర్యవేక్షిస్తూ నాణ్యతతో పూర్తి చేయాలని కలెక్టర్ ఇరిగేషన్ అధికారులను ఆదేశించారు.తొలిసాపురం గ్రామ రైతులను పొలం పిలుస్తోంది కార్యక్రమానికి పిలిపించి ప్రీ మాన్సూన్ డ్రై సోయింగ్, ఆధునిక వ్యవసాయ పద్ధతుల గురించి మరింత అవగాహన కల్పించాలని కలెక్టర్ వ్యవసాయ అధికారులను ఆదేశించారు.కార్యక్రమంలో కర్నూలు ఆర్డీవో సందీప్ కుమార్, డ్వామా పిడి నరసింహ రెడ్డి, ఇరిగేషన్ ఈఈ వెంకటేశ్వర్లు, అసిస్టెంట్ ఇంజనీర్ రియాజ్ అహ్మద్, కర్నూలు రూరల్ తహశీల్దార్ రమేష్ బాబు, తదితరులు పాల్గొన్నారు.

