అలనాటి జ్ఞాపకాలే..నేటి కలయిక
1 min read
జ్ఞాపకాలను నెమరు వేసుకున్న పూర్వ విద్యార్థులు..
మిడుతూరు(నందికొట్కూరు) న్యూస్ నేడు: ఆనాడు పాఠశాలలో చదువుకున్న జ్ఞాపకాలను గుర్తుకు తెచ్చుకొని తోటి స్నేహితులు కలుసుకొని ఒకరినొకరు కష్టసుఖాలను పాలుపంచుకున్నారు. నంద్యాల జిల్లా మిడుతూరు జిల్లా పరిషత్ పాఠశాలలో 2003-04 పదవ తరగతి బ్యాచ్ పూర్వ విద్యార్థులు మంగళవారం పాఠశాలలో పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళన కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు.ఆనాడు టీచర్లు చెప్పిన విద్యాబోధనలే ఈనాడు మేము ఒక ఉన్నత స్థానంలో ఉండడానికి ఉపాధ్యాయుల కృషి ఎంతో మరువలేనిదని ఉపాధ్యాయులను పూర్వ విద్యార్థులు కొనియాడారు. సుమారు 22 ఏళ్ల తర్వాత తోటి మిత్రులను, విద్యాబుద్ధులు నేర్పిన గురువులను ఒకే వేదికపై చూసుకుని పూర్వ విద్యార్థులందరూ అమితమైన సంతోషం వ్యక్తం చేశారు.గుర్తుగా ఉపాధ్యాయులను శాలువా పూలమాలలతో జ్ఞాపికలను అందజేస్తూ ఘనంగా సత్కరించారు.పాఠశాల అవసరాల నిమిత్తం ఉపాధ్యాయుల కోసం 12-లాకర్ల బీరువాను,స్టాఫ్ కోసం 3 కంప్యూటర్ టేబుళ్లను అలాగే స్కూల్ గేట్ దగ్గర బస్ కోసం వేచి చూసే వారి కోసం 2 సిమెంట్ బెంచీలను కొనుగోలు చేసి ప్రధానోపాధ్యాయులకు విరాళంగా అందజేశారు. ఈ కార్యక్రమంలో పూర్వ విద్యార్థులు నబి సాహెబ్, నూర్ భాష,మధు,చంద్రకాంత్ నారాయణ తదితర 70 మంది పూర్వ విద్యార్థులు పాల్గొన్నారు.

