హోళగుంద విద్యార్థుల క్రీడా ప్రతిభకు రాష్ట్రస్థాయి గుర్తింపు!
1 min read
క్రికెట్, కబడ్డీ, షూటింగ్ బాల్ పోటీల్లో సత్తా చాటిన జెడ్పీహెచ్‌ఎస్ విద్యార్థులు
జాతీయస్థాయి పోటీలకు ఎంపికైన సి. భూమిక.. విద్యార్థులను అభినందించిన ప్రధానోపాధ్యాయులు కబీర్ సాబ్
హోళగుంద న్యూస్ నేడు: హోళగుంద జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థులు క్రీడా పోటీల్లో ప్రతిభ కనబరుస్తూ పాఠశాలకు మంచి పేరు తీసుకొస్తున్నారు. క్రికెట్, కబడ్డీ, షూటింగ్ బాల్ పోటీల్లో రాణించి రాష్ట్రస్థాయి, జాతీయస్థాయి పోటీలకు ఎంపిక కావడం విశేషం.ఈ నెల 26న కర్నూలులో నిర్వహించిన ఎస్‌జీఎఫ్ అండర్-17 క్రికెట్ టోర్నమెంట్‌లో పదో తరగతి విద్యార్థి సి. సాగర్ (లక్ష్మన్న కుమారుడు) జిల్లా స్థాయిలో ప్రతిభ కనబరిచి, రాష్ట్రస్థాయి పోటీల ఎంపిక ప్రాబబుల్స్ జాబితాలో స్థానం సంపాదించాడు.అదేవిధంగా పదో తరగతి విద్యార్థినులు సి. భూమిక, పి. అనురాధ ఎస్‌జీఎఫ్ అండర్-17 కబడ్డీ రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికయ్యారు. అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన 36వ ఆంధ్రప్రదేశ్ అంతర్‌జిల్లా కబడ్డీ పోటీల్లో పాఠశాల విద్యార్థులు పాల్గొని ద్వితీయ స్థానం సాధించారు. ఈ పోటీల్లో ప్రతిభ కనబరిచిన సి. భూమిక జాతీయస్థాయి పోటీలతో పాటు అండర్-19 రాష్ట్రస్థాయి పోటీలకు కూడా ఎంపికైంది.అలాగే గుంటూరులో అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన రాష్ట్రస్థాయి షూటింగ్ బాల్ పోటీల్లో తొమ్మిదో, పదో తరగతులకు చెందిన విద్యార్థులు పాల్గొన్నారు. పదో తరగతి విద్యార్థులు మణిశంకర్, అభిరామ్‌తో పాటు ఇతర విద్యార్థులు ప్రతిభ కనబరిచి ప్రశంసాపత్రాలు అందుకున్నారు.ఈ సందర్భంగా పాఠశాల ప్రధానోపాధ్యాయులు పి. కబీర్ సాబ్ ప్రతిభ కనబరిచిన విద్యార్థులను అభినందించి సర్టిఫికెట్లు ప్రదానం చేశారు. విద్యార్థులు భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించి పాఠశాలకు, గ్రామానికి మంచి పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు.ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు పి. కబీర్ సాబ్, ఇన్‌చార్జి ఉపాధ్యాయులు యూనస్ సార్, పీడీ మేడమ్‌తో పాటు ఇతర ఉపాధ్యాయులు పాల్గొని విద్యార్థులను అభినందించారు.



