గిరిజనుల అభ్యున్నతికి ప్రభుత్వం కృషి..
1 min read

గిరిజనుల పిల్లలను పాఠశాలలకు పంపాలి
వసతి గృహాల్లో మౌలిక సదుపాయాలకు కృషి
నంద్యాల జిల్లా కలెక్టర్ రాజకుమారి..
నంద్యాల, న్యూస్ నేడు : గిరిజనుల అభ్యున్నతి కోసం రాష్ట్ర ప్రభుత్వం కృషి చేయడంతో పాటు వారి సంక్షేమానికి కట్టుబడి ఉంటుందని నంద్యాల జిల్లా కలెక్టర్ జి రాజకుమారి అన్నారు.శనివారం ప్రపంచ ఆదివాసీ దినోత్సవం సందర్భంగా కలెక్టరేట్ పిజిఆర్ఎస్ హాల్లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో జిల్లా కలెక్టర్,ఐటిడిఎ పీఓ వెంకట శివప్రసాద్,గిరిజన సంఘాల నాయకులు హాజరయ్యారు.ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం గిరిజనుల అభివృద్ధి,సంక్షేమం కోసం అన్ని విధాల సహాయ సహకారాలు అందజేయడం జరుగుతుందని జిల్లాలో గిరిజన బాలబాలికల కోసం 13 ఆశ్రమ పాఠశాలలు,9 గిరిజన వసతి గృహాలను ఐటిడిఎ,గిరిజన సంక్షేమ అధికారి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నామని వీటిలో సరైన మౌలిక సదుపాయాలు కల్పనకు నిరంతరం కృషి చేస్తున్నామన్నారు. అదేవిధంగా చెంచు గూడాలలోని తల్లిదండ్రులు కూడా వారి పిల్లల విద్య పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించి పాఠశాలలకు పంపాలన్నారు. చదువుతోపాటు వారికి నచ్చిన అంశాలపై దృష్టి సారించేలా పిల్లలకు అవగాహన కల్పించాలన్నారు.జిల్లాలో బాల్య వివాహాల నిర్మూలనకు నిరంతరం కృషి చేయడం జరుగుతుందని అదేవిధంగా చెంచుగూడాలలోని గిరిజనులకు ఆరోగ్యపరమైన సహాయ సహకారాలు అందించేందుకు క్యాంపులు నిర్వహించి వారి ఆరోగ్య పరిరక్షణకు కృషి చేయడం జరుగుతోందన్నారు.జిల్లా అధికారులు చెంచుగూడాల పర్యటనలకు వెళ్ళినప్పుడు వారు చెడు వ్యసనాల బారిన పడకుండా వారికి అవగాహన కల్పించడంతోపాటు వారి జీవనోపాధికి అవసరమైన మెరుగుపరుచుకోవడం పట్ల అవగాహన కల్పించాలన్నారు. చెంచుగూడాలలోని పివిటీజీలకు ఇళ్ల నిర్మాణాల కోసం కేంద్ర ప్రభుత్వం ద్వారా లక్ష 80 వేలు,రాష్ట్ర ప్రభుత్వం అదనంగా లక్ష రూపాయల ఆర్థిక సహాయం అందజేయడం జరిగిందన్నారు.ఈ కార్యక్రమంలో భాగంగా పిఎం జన్మన్ ద్వారా 600 ఇళ్లకు అనుమతులు మంజూరు చేయడం జరిగిందని గిరిజన సంఘాల నాయకులు కూడా ముందుకు వచ్చి వారికి ఇల్ల నిర్మాణాలు చేయించేలా చూడాలని గిరిజన సంఘాల నాయకులకు కలెక్టర్ సూచించారు.గిరిజన వేషధారణలో చిన్నారుల సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ అలరించాయి.


