NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

విద్యా మంత్రిచే ఆపస్ వారి నా పాఠశాల నాకు గర్వకారణం పోస్టర్ విడుదల

1 min read

విజయవాడ , న్యూస్​ నేడు  : విద్యాశాఖ మంత్రివర్యులు శ్రీ నారా లోకేష్ ని ప్రత్యేకంగా ఉండవల్లి లోని వారి నివాసంలో ఆంధ్రప్రదేశ్ ఉపాధ్యాయ సంఘం (ఆపస్) పక్షాన రాష్ట్ర అధ్యక్షులు ఎస్ బాలాజీ, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జివి సత్యనారాయణ, రాష్ట్ర కోశాధికారి యం సురేష్ కుమార్, రాష్ట్ర ఉపాధ్యక్షులు శ్రీమతి సునీత కలిసి దాదాపు అరగంట పైగా విద్యారంగ మరియు ఉపాధ్యాయ సమస్యలపై చర్చించడం జరిగింది. ప్రతి సమస్యను కూలంకషంగా మంత్రి కి వివరించడం జరిగింది. అన్ని సమస్యల పైన మంత్రివర్యులు సానుకూలంగా స్పందించి తాను వ్యక్తిగతంగా అన్ని సమస్యల పైన రిపోర్టు తెప్పించుకొని పరిష్కరిస్తానని తెలిపారు. ప్రతి సమస్య మీద ప్రత్యేకంగా వినతి పత్రం అందించడం జరిగింది. ప్రస్తావించిన సమస్యలు, మంత్రిగారు ప్రతిస్పందన: కేంద్ర ప్రభుత్వ మెమో 57 ప్రకారం 2003 డిఎస్సి వారికి పాత పెన్షన్ అమలు చేయాలని కోరగా తప్పకుండా ఫైల్ గురించి వివరాలు తెప్పించుకొని వీలైనంత త్వరగా పరిష్కరిస్తామని తెలిపారు. ఏకీకృత సర్వీస్ రూల్స్ అమలు చేసి అన్ని కేడర్ల ప్రమోషన్లు చేపట్టాలని కోరగా ప్రత్యేక కమిటీతో వివరాలు తెప్పించుకుని అమలు చేయడానికి ప్రయత్నిస్తామన్నారు.  12వ పిఆర్సి కమిటీ, ఐ ఆర్ ప్రకటన, డి ఏ ల ప్రకటన, ఆర్థిక బకాయిల విషయాన్ని ప్రస్తావించగా ఆర్థిక ఇబ్బందుల దృష్ట్యా కొంత ఆలస్యం జరుగుతోందని, అయినప్పటికీ ఇప్పటికే ఏడు వేల కోట్లు కేటాయించామని, మిగిలిన విషయాలపై కూడా వెంటనే దృష్టి పెడతామని తెలిపారు.తెలుగు మీడియం సమాంతరంగా కొనసాగించాలని కోరగా అన్ని పాఠశాలల్లో కాకపోయినా అవసరమైన కొన్ని పాఠశాలల్లో అయినా కొనసాగించేందుకు ప్రయత్నిస్తామని, ఈ విద్యా సంవత్సరం కూడా 10వ తరగతి పరీక్షలు తెలుగు మీడియం లో రాయాలనుకునే విద్యార్థులకు అవకాశం ఇస్తామని తెలిపారు.హై స్కూల్ ప్లస్ లను కొనసాగిస్తామని, బలోపేతానికి కృషి చేస్తామని, విద్యార్థులకు ఇబ్బందులు లేకుండా త్వరలో పిజిటిలను నియామకం చేపడతామని తెలిపారు. 302 జీవో పునరుద్ధరించి గతంలో ఉన్న విధంగా జూనియర్ లెక్చరర్స్ ప్రమోషన్లు చేపట్టాలని కోరగా తప్పకుండా అవకాశం కల్పించడానికి ప్రయత్నిస్తామన్నారు. అంతర్ జిల్లా బదిలీలు త్వరలోనే చేపడుతామని తెలిపారు డీఈవో పూల్ లో ఉన్న పండితుల, పీఈటీల ప్రమోషన్ల విషయంలో ఉన్న ఇబ్బందులను తొలగిస్తామని, త్వరలో ప్రమోషన్లు చేపడతామని తెలిపారు. ఎంఈఓ ల బదిలీలు కూడా త్వరలోనే చేపడతామని, ఎంఈఓ 1 లుగా స్కూల్ అసిస్టెంట్లను  శాలరీ అడ్జస్ట్మెంట్స్ కోసమే నియమించామని, ఎంఈఓ ల బదిలీల తర్వాత స్కూల్ అసిస్టెంట్లు ఉండబోరని తెలిపారు. మనబడి మన భవిష్యత్తు కు నిధులు కేటాయించాలని కోరగా మోడల్ ప్రైమరీ స్కూలుకు మొదటి ప్రాధాన్యతగా కేటాయిస్తామని తెలిపారు. ఉన్నత పాఠశాలలో కంప్యూటర్ ఇన్స్ట్రక్టర్లను నియమించాలని కోరగా ఆలోచన చేస్తున్నామని తెలిపారు.పాఠ్యపుస్తకాల సిలబస్ పై రివ్యూ చేయాలని కోరగా ఎస్సీఈఆర్టీ డైరెక్టర్ కి తెలియజేస్తామని తెలిపారు. అలాగే ప్రస్తుతం టీచర్లలో ఉన్న ఇబ్బందులను అన్నింటిని ఆన్లైన్ వర్క్స్ ఎక్కువ కావడం, అసెస్మెంట్ బుక్ లెట్స్, ఓఎంఆర్ ల,ల స్కానింగ్, ఓహెచ్ ల ప్రకటన ఇంకా మరిన్ని సమస్యలను వారి దృష్టికి తీసుకుపోగా, త్వరలోనే అన్ని సమస్యలకు పరిష్కారం చూపుతామని తెలిపారు.ఉపాధ్యాయ సంఘాలతో సమన్వయ సమావేశం నిర్వహించాలని కోరగా సెప్టెంబర్ 5 తర్వాత నిర్వహిస్తామని అన్ని విషయాలపై చర్చిస్తామని తెలిపారు.చివరగా అన్ని సమస్యల పైన వినతి పత్రాలు అందించడం జరిగింది. సెప్టెంబర్ 1 న ఆంధ్రప్రదేశ్ ఉపాధ్యాయ సంఘం వారిచే రాష్ట్రవ్యాప్తంగా పాఠశాలల్లో నిర్వహించే నా పాఠశాల నాకు గర్వకారణం పోస్టర్లను మంత్రిచే ఆవిష్కరించడం జరిగింది.

About Author