అడ్వాన్సుడ్ లైఫ్ సపోర్ట్ అంబులెన్స్ ప్రారంభించిన ఎమ్మెల్యే చంటి
1 min read
అత్యాధునిక వైద్య పరికరాలు ఇందులో అమర్చబడి ఉన్నాయి
అత్యవసర వైద్య సేవలకు(ఏఎల్ఎస్) కీలకపాత్ర పోషిస్తుంది
ఏలూరుజిల్లా ప్రతినిధి న్యూస్ నేడు : ఏలూరు జిల్లాలో అత్యవసర వైద్య సేవల బలోపేతం కోసం కొత్త (ఏఎల్ఎస్) అంబులెన్స్ ను ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి మంగళవారం ప్రారంభించారు. ఏలూరు జిల్లాలో వైద్య సేవలను మరింత బలోపేతం చేసే దిశగా కీలకమైన చర్యలో భాగంగా, అత్యాధునిక సాంకేతికతతో కూడిన అడ్వాన్స్డ్ లైఫ్ సపోర్ట్ అంబులెన్స్‌ను జిల్లాకు కేటాయించడం జరిగింది. ఈ అంబులెన్స్‌లో అత్యవసర వైద్య సేవలకు అవసరమైన అన్ని ఆధునిక పరికరాలు అందుబాటులో ఉన్నాయని ఎమ్మెల్యే అన్నారు. ఈ ఏఎల్ ఎస్ అంబులెన్స్‌ను ఏలూరు శాసనసభ్యులు బడేటి చంటి స్వయంగా పరిశీలించి, దానిలోని వైద్య పరికరాలు, సాంకేతిక సౌకర్యాల గురించి వివరంగా తెలుసుకున్నారు. అనంతరం ఆయన జెండా ఊపి ఈ అంబులెన్స్‌ను జిల్లా ప్రజల సేవ కోసం అధికారికంగా ప్రారంభించారు.ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో శాసనసభ్యులు బడేటి చంటి మాట్లాడుతూ, ఈ కొత్త ఏఎల్ఎస్ అంబులెన్స్ ఏలూరు జిల్లా ప్రజలకు అత్యవసర వైద్య సేవలను సకాలంలో, సమర్థవంతంగా అందించడంలో కీలక పాత్ర పోషిస్తుందని పేర్కొన్నారు. కూటమి ప్రభుత్వం, భవ్య హెల్త్ కేర్ సర్వీసెస్ (పబ్లిక్-ప్రైవేట్ పార్టనర్ షిప్ -) ఆధ్వర్యంలో జిల్లాలో వైద్య సేవలను మరింత మెరుగుపరిచేందుకు కట్టుబడి ఉందని, ఈ అంబులెన్స్ కేటాయింపు ఆ నిబద్ధతకు ఒక స్పష్టమైన నిదర్శనమని ఆయన అన్నారు.ఈ ఏ ఎల్ ఎస్ అంబులెన్స్‌లో అత్యవసర సమయంలో రోగుల జీవన రక్షణకు అవసరమైన ఆక్సిజన్ సిలిండర్లు, వెంటిలేటర్లు, డిఫిబ్రిలేటర్లు, ఇంజక్షన్లు, మందులు, ఇతర అత్యాధునిక వైద్య పరికరాలు అందుబాటులో ఉన్నాయని ఆయన తెలిపారు.. కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్ మామిళ్ళపల్లి పార్థసారథి, ఈడా చైర్మన్ పెద్దిబోయిన శివప్రసాద్, 108 అంబులెన్స్ సేవల జిల్లా మేనేజర్ దాసరి రాజు, ఫ్లీట్ మేనేజర్ రామానుజనేయలు, పైలట్లు నరహరి, శివ, నాగరాజు, టెక్నీషియన్ సురేష్ మరియు ఇతర సిబ్బంది పాల్గొన్నారు. వారు అంబులెన్స్‌లోని సాంకేతిక వివరాలను, రోగులకు అందించే సేవలను శాసనసభ్యులకు వివరించారు.ఈ కొత్త ఏ ఎల్ ఎస్ అంబులెన్స్ ద్వారా ఏలూరు జిల్లాలో అత్యవసర వైద్య సేవలు మరింత వేగవంతంగా, సమర్థవంతంగా అందుబాటులో ఉంటాయని, ఇది జిల్లా ప్రజల ఆరోగ్య రక్షణలో కీలక పాత్ర పోషిస్తుందని అధికారులు తెలిపారు. కూటమి ప్రభుత్వం ఆరోగ్య రంగంలో మరిన్ని సంస్కరణలను, సౌకర్యాలను అందించేందుకు కృషి చేస్తోందని, ఈ కార్యక్రమం ఆ దిశగా ఒక ముఖ్యమైన అడుగు అని వారు పేర్కొన్నారు.

