దివంగత సురవరం సుధాకర్ రెడ్డి సంస్మరణ సభ
1 min read

కర్నూలు, న్యూస్ నేడు: నగరంలోని జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో జరిగిన సిపిఐ జాతీయ ప్రధాన కార్యదర్శి దివంగత సురవరం సుధాకర్ రెడ్డి సంస్మరణ సభలో ముఖ్యఅతిథిగా రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్ పాల్గొన్నారు . ఈ సందర్భంగా దివంగత సురవరం సుధాకర్ రెడ్డి చిత్రపటానికి పుష్పాలు అర్పించి ఆయన నివాళులర్పించారు .ఈ కార్యక్రమంలో సిపిఐ నాయకులతో పాటు వివిధ రాజకీయ పార్టీలకు చెందిన నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్ మాట్లాడుతూ సిపిఐ నేత దివంగత సురవరం సుధాకర్ రెడ్డితో తనకు మంచి సంబంధాలు ఉండేవని, ఆయన తనను ఎంతో ఆప్యాయతతో పలకరించే వారని వివరించారు. ఒక సాధారణ కార్యకర్త నుంచి సిపిఐ జాతీయ ప్రధాన కార్యదర్శి హోదా వరకు దివంగత సురవరం సుధాకర్ రెడ్డి ఎదిగారని వివరించారు. ఇతర కమ్యూనిస్టు నాయకులతో పోలిస్తే సురవరం సుధాకర్ రెడ్డి ఎంతో సౌమ్యంగా ఉంటారని తెలిపారు.. కర్నూల్ లో సురవరం సుధాకర్ రెడ్డి ని గుర్తు చేసేలా ఏదైనా ఏర్పాటు చేసేందుకు తన వంతు కృషి చేస్తానని వెల్లడించారు. దేశంలో అన్ని రాజకీయ పార్టీల సిద్ధాంతాలు ఒకటేనని, అందులో పని చేసే నాయకుల వ్యక్తిత్వం వల్లే ఆ పార్టీలకు మంచి పేరు వస్తుందని తెలియజేశారు. దివంగత సురవరం సుధాకర్ రెడ్డి సమకాలికుడిగా ఉండటం తనకు మంచి అనుభవంగా చెప్పారు. పార్లమెంటు, అసెంబ్లీలలో మైక్ ఆన్ అవగానే ప్రతిపక్ష అధికార పక్షాల మధ్య తీవ్ర వాగ్వివాదాలు జరుగుతాయని, తరువాత మైక్ ఆఫ్ కాగానే అందరూ ఒకరినొకరు స్నేహితుల పలకరించుకుంటామని చెప్పారు. ఈ విషయాన్ని ప్రజలు గుర్తించి అనవసర వివాదాలకు వెళ్లకుండా ఉండాలని సూచించారు. రాజకీయాలలో విమర్శలు కేవలం సిద్ధాంతాల పరంగానే ఉండాలని ఆయన తెలిపారు .ఇక ప్రపంచ రాజకీయాలను పరిశీలిస్తే చైనా ,రష్యాలతో మన దేశం కలవడాన్ని కొందరు విమర్శిస్తున్నారని, అయితే ఇది ప్రపంచ అభివృద్ధి కోసం మాత్రమే జరిగిన కలయిక అన్నది గుర్తించాలన్నారు. అనంతరం సిపిఐ రాష్ట్ర కార్యదర్శి నారాయణ మాట్లాడుతూ సురవరం సుధాకర్ రెడ్డి మరణం తమ పార్టీకి తీరని లోటని చెప్పారు. కమ్యూనిస్టు పార్టీ నాయకుడిగా సురవరం సుధాకర్ రెడ్డి ప్రజా సమస్యలపై అలుపెరుగని పోరాటం చేశారని తెలియ చేశారు.

