డ్రగ్స్ లేని భారతదేశంను నిర్మిద్దాం
1 min read

కర్నూలు, న్యూస్ నేడు: డ్రగ్స్ రహిత భారతదేశం నిర్మాణమే లక్ష్యంగా భారతీయ జనతా యువమోర్చా ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన నమో మారథాన్ ను రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్ జెండా ఊపి ప్రారంభించారు. నగరంలోని రాజవిహార్ సెంటర్ నుంచి కలెక్టరేట్ వరకు జరిగిన ఈ కార్యక్రమంలో రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్ తో పాటు భారతీయ జనతా యువమోర్చా రాష్ట్ర అధ్యక్షుడు సునీల్ కుమార్ రెడ్డి, జిల్లా అధ్యక్షుడు కేశవ రామ్ చౌదరి, బిజెపి నాయకులు రామస్వామి, నగరూరు రాఘవేంద్ర, డాక్టర్ వినుషారెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న విద్యార్థులు డ్రగ్స్ లేని సమాజాన్ని నిర్మిద్దాం…. డ్రగ్స్ లేని భారతదేశంను నిర్మిద్దాం ..అంటూ ప్ల కార్డులను ప్రదర్శించారు. అనంతరం జరిగిన సమావేశంలో రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్ మాట్లాడుతూ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ దేశంలో మాదకద్రవ్యాల వినియోగానికి వ్యతిరేకంగా యుద్ధం ప్రకటించారని, ఇందులో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని కోరారు. చైనా, పాకిస్థాన్ వంటి దేశాలతో యుద్ధం చేయడం సులభమని, కానీ లక్షలాదిమంది ప్రాణాలను బలిగొంటున్న మాదకద్రవ్యాలకు వ్యతిరేకంగా ప్రకటించిన యుద్ధంలో ప్రతి ఒక్కరూ పాల్గొనాలని సూచించారు. మాదకద్రవ్యాల వినియోగం ,అమ్మకాల సమాచారం తెలిస్తే పోలీసులకు సమాచారం అందించి వాటి నిరోధానికి కృషి చేయాలని రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్ కోరారు.


