ఉపాధ్యాయ వృత్తి పవిత్రమైంది…
1 min read

పత్తికొండ , న్యూస్ నేడు: ఉపాధ్యాయ వృత్తి ఎంతో పవిత్రమైందని, ఉపాధ్యాయుల బదిలీలు సర్వసాధారణమైందని స్థానిక జిల్లా పరిషత్ బాలిక ఉన్నత పాఠశాలలో విధులు నిర్వహించి పదవి విరమణ పొందిన వనజా దేవి అన్నారు. పాఠశాల ఉపాధ్యాయ బృందం పదవి విరమణ పొందిన సోషల్ ఉపాధ్యాయిని వనజాదేవిని ఘనంగా సత్కరించారు. పాఠశాల విద్యార్థినిలు, ప్రధానోపాధ్యాయులు శ్రీమతి కాటం శ్రీదేవి ఆధ్వర్యంలో ఘనంగా ఆమెకు వీడ్కోలు పలికారు. .ఈ వీడ్కోలు సమావేశానికి అధ్యక్షత వహించిన శ్రీదేవి మాట్లాడుతూ, ఉపాధ్యాయ వృత్తి అన్ని వృత్తులలో కంటే పవిత్రమైనదని ,ప్రవర్తన కలిగిన ఉత్తమ సమాజాన్ని నిర్మించేది కేవలం ఒక ఉపాధ్యాయ వృత్తి అని ఆమె తెలిపారు. అలాంటి వృత్తిలో కొనసాగి నేడు పదవి విరమణ చేసిన వనజాదేవి సేవలను ఆమె కొనియాడారు. .ఎస్టియు సీనియర్ నాయకులు కే. నారాయణ మాట్లాడుతూ, ఉపాధ్యాయ వృత్తి అనేది సమాజంలో అత్యంత విశిష్టమైన మరియు పవిత్రమైన వృత్తులలో ఒకటి అన్నారు. ఇది కేవలం ఉద్యోగం మాత్రమే కాదు విద్యార్థుల జీవితాల్లో గొప్ప ప్రభావాన్ని చూపి వారి భవిష్యత్తును తీర్చిదిద్దే ఒక తపస్సు లాంటిది అని ఆయన తెలిపారు. అలాంటి వృత్తిలో కొనసాగి నేడు పదవి విరమణ చేస్తున్న వనజా దేవి కి ఆయురారోగ్యాలు , సుఖ సంతోషాలతో జీవనం సాగించాలని కోరుకున్నారు.ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయురాలు భ్రమరాంబ , వెంకమ్మ, వరలక్ష్మి, శ్యామల, రిటైర్డ్ ఫిజికల్ డైరెక్టర్ బీపీసీ రంగస్వామి, మీరా హుస్సేన్, ఉపాధ్యాయినీ ఉపాధ్యాయులు, విద్యార్థులు, బంధుమిత్రులు, ఉపాధ్యాయ సంఘాలు, వనజాదేవి, నాగభూషణం దంపతులను శాలువాలతో, పూలమాలలతో ఘనంగా సత్కరించారు.

