రోడ్డు కు మోక్షం ఎప్పుడు.?
1 min read

మాసలగెరి వీధిలో సీసీ రోడ్డు–డ్రైనేజీ కలగానే మిగిలిందా?
కౌతాళం, న్యూస్ నేడు: కౌతాళంలోని మాసలగెరి వీధి ప్రజలకు నిత్యం నరకయాతగా మారింది.సీసీ రోడ్డు, డ్రైనేజీ సౌకర్యాలు లేకపోవడంతో స్థానికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వర్షాకాలంలో మరింత దారుణం. రామలింగేశ్వర ఆలయం దగ్గర నుండి చెన్నకేశవ స్వామి ఆలయానికి వెళ్లే ప్రధాన రహదారి వరకు పూర్తిగా గుంతలమయంగా మారింది.రోడ్డుపైనే మురికి నీరు ప్రవహించడంతో దుర్వాసనతో పాటు దోమల బెడద పెరిగింది. వర్షం పడితే పరిస్థితి మరింత దారుణంగా మారుతోందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రతిరోజు భక్తులు ఆలయానికి వెళ్లాలంటే మురికి నీటిలో నడవాల్సిన దుస్థితి ఏర్పడిందని వాపోతున్నారు. పిల్లలు, వృద్ధులు, మహిళలు జారిపడిన ఘటనలు కూడ ఉన్నాయి. తాత్కాలిక మరమ్మతులు కూడా చేపట్టకపోవడం అధికారుల నిర్లక్ష్యానికి నిదర్శనమని విమర్శిస్తున్నారు.కనీసం డ్రైనేజీ ఏర్పాటు చేసి, సీసీ రోడ్డు నిర్మాణం చేపట్టాలని కోరుతున్నారు.ఇప్పటికైనా నాయకులు , సంబంధిత అధికారులు స్పందించి మాసలగెరి వీధి ప్రజలకు రోడ్డు “మోక్షం” కల్పించాలని స్థానికులు కోరుతున్నారు.

