NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

పాతాళగంగ స్నాన ఘట్టాల ఏర్పాట్లపై జిల్లా కలెక్టర్ పరిశీలన

1 min read

శ్రీశైలం / నంద్యాల  న్యూస్​ నేడు: మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల సందర్భంగా శ్రీశైలానికి భారీగా తరలివస్తున్న భక్తుల సౌకర్యార్థం పాతాళగంగ వద్ద ఏర్పాటు చేసిన స్నాన ఘట్టాలను గురువారం జిల్లా కలెక్టర్ జి. రాజకుమారి ప్రత్యక్షంగా పరిశీలించారు.ఈ సందర్భంగా భక్తులకు కల్పిస్తున్న సౌకర్యాలపై సమగ్రంగా ఆరా తీశారు. స్నాన ఘట్టాల వద్ద పారిశుద్ధ్య నిర్వహణ సక్రమంగా జరుగుతోందా లేదా, టాయిలెట్లు పరిశుభ్రంగా ఉన్నాయా, రన్నింగ్ వాటర్ అందుబాటులో ఉందా అనే అంశాలను స్వయంగా పరిశీలించారు. దుస్తులు మార్చుకునే గదులు శుభ్రంగా ఉంచుతున్నారా ఇబ్బందులు లేకుండా  సౌకర్యాలు కల్పించారా అనే విషయాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. అలాగే, భక్తుల భద్రతను దృష్టిలో ఉంచుకుని నియమించిన గజ ఈతగాళ్లు (లైఫ్ గార్డులు) ఎంతమంది ఉన్నారు, వారు విధుల్లో నిరంతరం అందుబాటులో ఉన్నారా అనే విషయంపై సంబంధిత అధికారులను అడిగి తెలుసుకున్నారు. అత్యవసర పరిస్థితుల్లో తక్షణ స్పందన కోసం అవసరమైన భద్రతా ఏర్పాట్లు సిద్ధంగా ఉంచాలని ఆదేశించారు. భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా పరిశుభ్రమైన వాతావరణంలో సురక్షితంగా స్నానాలు నిర్వహించేలా చర్యలు తీసుకోవాలని సంబంధిత శాఖల అధికారులకు కలెక్టర్ సూచించారు. పారిశుద్ధ్య సిబ్బంది నిరంతరం విధుల్లో ఉండి పరిశుభ్రతను కాపాడాలని, తాగునీటి సరఫరా నిరంతరం అందుబాటులో ఉండేలా చూడాలని ఆదేశించారు. భక్తుల రద్దీ పెరుగుతున్న దృష్ట్యా సమన్వయంతో పనిచేసి, అన్ని మౌలిక సదుపాయాలను పర్యవేక్షిస్తూ ఉండాలని సంబంధిత అధికారులకు కలెక్టర్ స్పష్టం చేశారు.

About Author