ఔషధమొక్కల సాగుతో ఆర్థికభరోసా
1 min read

విస్తృత పర్యటనలో సిఈఓ చంద్రశేఖర్
కర్నూలు, న్యూస్ నేడు: ఔషధ మొక్కల సాగుతో రైతులకు ఆర్థిక భరోసా ఖాయమని ఏపీ ఔషధ మొక్కలు, సుగంధ ద్రవ్యాల బోర్డు ముఖ్య కార్యనిర్వహణాధికారి (సిఈఓ) ఆవుల చంద్రశేఖర్ అన్నారు. వరుసగా మూడు రోజులపాటు రాయలసీమ జిల్లాల్లో క్షేత్రస్థాయి పర్యటనలను విస్తృతంగా సాగించారు. తిరుపతి, అన్నమయ్య, శ్రీసత్యసాయి, అనంతపురము, కర్నూలు జిల్లాల రైతులతో ఆయన నేరుగా కలిసి మాట్లాడారు. కర్నూలు జిల్లాలో ఔషధ మొక్కలు సాగుచేస్తున్న పొలాలకు బుధవారం స్వయంగా వెళ్లి పరిశీలించారు. అధిక దిగుబడి సాధించిన రైతులను ప్రత్యేకంగా అభినందించారు.నూతన పరిశోధనలను కొనసాగించాలని వ్యవసాయ శాస్త్రవేత్తలు, పరిశోధక విద్యార్థులను ప్రోత్సహించారు. జిల్లాలో కుసుమ పంట బాగా రావడంతో దాని ప్రయోజనాలను సిఈఓ చంద్రశేఖర్ ప్రత్యేకంగా వివరించారు. కుసుమ నూనె, పూలు, విత్తనాలు వైద్యానికి ఎంతగానో ఉపయోగపడతాయన్నారు. రక్త ప్రసరణ మెరుగుదల, రుతుస్రావం క్రమబద్ధీకరణ, చెడు కొవ్వు నియంత్రణ, గుండె జబ్బుల నివారణకు వాడతారని చెప్పారు. రక్తం గడ్డకట్టకుండా ఉండటానికి చర్మవ్యాధుల చికిత్సకు, ఎముకల పటుత్వానికి, కీళ్లనొప్పుల నియంత్రణకు, రక్తశుద్ధికి, జ్వరం తగ్గడానికి ఇది పనికొస్తాయన్నారు.

