ఆరోగ్య సేవలపై ప్రజా అభిప్రాయం మెరుగుపడాలి
1 min read

జిల్లా కలెక్టర్ శ్రీమతి రాజకుమారి గణియా
నంద్యాల, న్యూస్ నేడు: జిల్లాలో వైద్య శాఖ ద్వారా ప్రజలకు అందిస్తున్న సేవలపై సానుకూల అభిప్రాయం పెరగాలంటే సేవల నాణ్యతను మెరుగుపరచాలని జిల్లా కలెక్టర్ జి. రాజకుమారి వైద్యాధికారులకు సూచించారు. గురువారం కలెక్టరేట్లోని ఎన్ఐసి వీడియో కాన్ఫరెన్స్ హాల్ నుండి మెడికల్ ఆఫీసర్లు, సీహెచ్సీ వైద్యులు, ప్రభుత్వ సర్వజన ఆసుపత్రి సూపరింటెండెంట్ తదితరులతో జూమ్ కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రభుత్వ ఆసుపత్రులకు వచ్చే ప్రతి రోగికి సమయానికి, నాణ్యమైన వైద్య సేవలు అందించడంపై ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు. ముఖ్యంగా పెద్దఎమ్మనూరు, రుద్రవరం ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల వద్ద వైద్య సేవలపై ప్రజల్లో ప్రతికూల అభిప్రాయం ఉన్నట్లు గుర్తించినందున, అక్కడి వైద్యులు సేవా దృక్పథంతో వ్యవహరించి రోగులకు మెరుగైన సేవలు అందించాలని ఆదేశించారు. అలాగే ఆళ్లగడ్డ సీహెచ్సీపై ఐవిఆర్ఎస్ కాల్స్ ద్వారా ఫిర్యాదులు వచ్చిన నేపథ్యంలో, సేవల్లో లోపాలు పునరావృతం కాకుండా తక్షణ చర్యలు తీసుకోవాలని సంబంధిత సిబ్బందిని కలెక్టర్ ఆదేశించారు. ప్రభుత్వ సర్వజన ఆసుపత్రిలో కూడా రోగులకు సకాలంలో చికిత్స, అవసరమైన సౌకర్యాలు అందేలా సూపరింటెండెంట్ చర్యలు చేపట్టాలని సూచించారు.ఈ సమావేశంలో డిఎంహెచ్ఓ డా. వెంకటరమణ, అదనపు డిఎంహెచ్ఓ డా. శారద, డిసిహెచ్ఎస్ డా. ఓ. లలిత తదితరులు పాల్గొన్నారు.

