అందరి సహకారంతోనే గ్రామాల అభివృద్ధి
1 min read

ఏఎంసీ చైర్మన్ వీరం ప్రసాద్ రెడ్డి
సాదాసీదాగా మండల సర్వసభ్య సమావేశం..
న్యూస్ నేడు మిడుతూరు (నందికొట్కూరు): అధికారులు ప్రజా ప్రతినిధుల సహకారంతో గ్రామాలను అభివృద్ధి చేసుకుందామని నందికొట్కూరు మార్కెట్ యార్డ్ చైర్మన్ వీరం ప్రసాదరెడ్డి అన్నారు. నంద్యాల జిల్లా మిడుతూరు మండల కేంద్రంలో మండల పరిషత్ కార్యాలయంలో గురువారం ఎంపీపీ మల్లు వెంకటేశ్వరమ్మ అధ్యక్షతన ఎంపీడీవో దశరథ రామయ్య ఆధ్వర్యంలో మండల సర్వసభ్య సమావేశం జరిగింది.వివిధ శాఖల మండల అధికారులు వారి నివేదికలను చదివారు.కందులు,శనగలు కొనుగోలు చేశారు కానీ వాటిని తీసుకెళ్లలేదని పాత్రికేయులు వివరించగా వెంటనే ఏఎంసీ చైర్మన్ మార్క్ ఫెడ్ డిఎంతో ఫోన్లో మాట్లాడగా ఈరోజు లారీని పంపిస్తామని డిఎం తెలిపారు.విద్యుత్ సమస్యల వల్ల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని లైన్ మెన్ కు ఎన్నిసార్లు ఫోన్ చేసినా స్పందించడం లేదని తిమ్మాపురం సర్పంచ్ స్వామి రెడ్డి అన్నారు.మొక్కజొన్నలను కొనుగోలు చేయడం లేదని అదేవిధంగా నాగలూటి పొలాలను సోలార్ తీసుకుంది కానీ సోలార్ వల్ల గ్రామ పంచాయతీకి ఏమీ ఆదాయం లేదని గ్రామంలో ఒక్కరికీ కూడా ఉద్యోగ అవకాశం కల్పించలేదని వైస్ ఎంపీపీ నబి రసూల్ అన్నారు.నా సొంత బోరుతో గ్రామానికి నీళ్లు సరఫరా చేస్తున్నాను నాకు చెప్పకుండానే ఉపాధి హామీ పథకం కింద సీసీ రోడ్డుకు భూమి పూజ ఎలా చేస్తారని పీరు సాహెబ్ పేట సర్పంచ్ చంద్రశేఖర్ రెడ్డి అధికారులపై మండిపడ్డారు.ఎంపీడీవో కార్యాలయం ఎదురుగా ఉన్న రోడ్డు మరియు మిడుతూరు- గార్గేయపురం,నాగలూటి- హైవే రోడ్డు వరకు రోడ్డు పనులు ఎప్పుడు ప్రారంభిస్తారు అని సభ్యులు ప్రశ్నించారు.ఎంపీపీ మరియు ఎంపీడీవో మాట్లాడుతూ గత ఐదేళ్లుగా సర్పంచులు గ్రామాల అభివృద్ధికి ఎంతగానో సహకరించారని సర్పంచులకు వారు కృతజ్ఞతలు తెలిపారు.ఈ కార్యక్రమంలో వివిధ మండల శాఖల అధికారులు సర్పంచులు ఎంపీటీసీలు తదితరులు పాల్గొన్నారు.


